జమ్ము కశ్మీర్‌లో ఎలక్ట్రిక్ హీటర్లను వినియోగించకూడదని జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. స్థానిక పార్టీలు, రాజకీయ నేతలు ఈ ఆదేశాలను తీవ్రంగా నిరసించాయి. దీంతో గంటల వ్యవధిలోనే ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ గందేర్బాల్ జిల్లాలో అధికారులు ఎలక్ట్రిక్ హీటర్లపై నిషేధం విధించడం చర్చీనీయాంశమైంది. ఎముకలు కొరికే చలితో వణికిపోతున్న ప్రాంతంలో ఎలక్ట్రిక్ హీటర్ల అమ్మకాలు, కొనుగోళ్లు, కలిగి ఉండటంపై నిషేధం విధించడాన్ని స్థానిక పార్టీలు అన్నీ ముక్తకంఠంతో తిరస్కరించాయి. ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై ఆగ్రహించాయి. దీంతో గంటల వ్యవధిలోనే కరెక్షన్ అని పేర్కొంటూ ఆర్డర్‌ను వెనక్కి తీసుకున్నారు.
గందేర్బాల్ జిల్లా మెజిస్ట్రేట్ శ్యామ్ బీర్ తన వివాదాస్పద ఆర్డర్‌ను వెనక్కి తీసుకుంటూ జారీ చేసిన కొత్త ఆదేశాల కాపీలో ఇలా పేర్కొన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144 సెక్షన్ కింద ఈ కార్యాలయం ఎలక్ట్రిసిటి సరఫరాలో అంతరాయం కలుగకుండా ఓ ఆదేశాన్ని జారీ చేసిందని వివరించారు. ఈ ఆదేశాలను తాను సవరిస్తున్నట్టు, ఎనర్జీని సక్రమంగా వినియోగించడానికి, ప్రాణ, ఆస్తి నష్టాన్ని అరికట్టడానికి కొన్ని సూచనలు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిబంధనలకు లోబడని క్రూడ్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, క్రూడ్ కుకింగ్ హీటర్లను నిషేధిస్తున్నట్టు వివరించారు.
కశ్మీర్ లోయలో మంచు పడుతూ చలి తీవ్రంగా పెరిగిన తరుణంలో ఈ ఆదేశాలు రావడంతో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్లు, అన్‌షెడ్యూల్డ్ పవర్ కట్లు, నిరంతరాయ విద్యుత్ సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాన్ ఆదేశాల్లో అధికారులు పేర్కొన్నారు. తద్వారా కొన్ని సార్లు ప్రాణ నష్ట లేదా ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయని, వాటిని నివారించగలమని తెలిపారు. కానీ, స్థానిక పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు వెనక్కి తగ్గకతప్పలేదు.
ఒమర్ అబ్దుల్లా ఈ ఆదేశాలను ట్వీట్ చేస్తూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఇది ఒక రిడిక్యులస్ ఆర్డర్ అని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ హీటర్ల అమ్మకాలు, వినియోగం, భ్రదపరుచుకోవడంపైనా బ్లాంకెట్ బ్యాన్ ఎలా విధిస్తారో చెప్పాలని నిలదీశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని హీటింగ్ లేదా కూలింగ్ డివైజులు కూడా సెక్షన్ 144 క్రితం వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రజలు చలికి వణికి భరించలేక మరణానికి కాళ్లు జాపి ఉండటాన్ని స్వాగతిస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నేతలు కూడా విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ అధికారులు కొత్త ఆదేశాలను వెల్లడించింది.
