జమ్మూ కశ్మీర్ లో ముష్కరులు దారుణానికి తెగబడ్డారు. భారత ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనాలనే టార్గెట్ గా చేసుకుని బాంబులతో దాడులకు పాల్పడి భారీ హింసం సృష్టించారు. ఈ దాడిలో దాదాపు 27 మంది జవాన్లు ప్రాణాలు వదిలారు. ఇంకా చాలామంది సైనికులు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 

జమ్మూ నుండి శ్రీనగర్ కు 70 వాహనాల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళుతున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న ముష్కరులు ముందుగానే ఆ దారిలో కాపుకాశారు. ఈ క్రమంలో ఓ  స్కార్పియో వాహనంలో దాదాపు 350 కిలోల పేలుడు పదార్థాలతో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి సైనిక వాహనాలు రాగానే పేల్చారు. ఈ పేలుళ్లకు సూసైడ్ బాండర్ ను ఉపయోగించిపనట్లు సైనికాధికారులు తెలిపారు. భారీ ఎత్తున పేలుడు జరగడంతో సంఘటనా స్ధలంలోనే 27 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.  

2016లో యూరి సైనిక స్థావరంపై జరిగిన దాడి తర్వాత మళ్లీ ఇలా ఆర్మీని టార్గెట్ గా చేసుకుని ముష్కరులు రెచ్చిపోయారు. ఆ ఘటన తర్వాత చెదురుమదురుగా సైనికులపై దాడులు జరిగినా ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. మళ్లీ ఇలా బాంబులతో రెచ్చిపోయిన ముష్కరులు భారత ఆర్మీ జవాన్ల ప్రాణాలను బలితీసుకున్నారు. ఆర్మీ వాహనంపై బాంబు దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది.  

భారత ఆర్మీపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముప్తీ, ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. దాడిలో ప్రాణాలు  కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు వీరు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ ట్వీట్లు చేశారు.