Gulannabi Azad:  ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా 7 ఏళ్లుగా ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలను విమర్శించాన‌నీ, తనపై ఎలాంటి అవినీతి కేసు, ఎఫ్‌ఐఆర్‌లు లేవని, ఎవరికీ భయపడలేదన్నారు. 

Jammu and Kashmir: కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీలా కాకుండా తాను వ్యక్తిగత దూషణలు చేయనని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు గులాం నబీ ఆజాద్ అన్నారు. ఏడేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న తాను ప్రధాని న‌రేంద్ర మోడీ ప్ర‌జా వ్య‌తిరేక విధానాలను విమర్శించానని చెప్పారు. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి ఆయ‌న రాహుల్ గాంధీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఆజాద్ ఇంట‌ర్వ్యూ వీడియో క్లిప్ ను పంచుకున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు జైరాం రమేష్.. దీనిని 'వాతావరణ మార్పు (క్లైమేట్ ఛేంజ్) అంటూ విమ‌ర్శించారు. వాతావరణ మార్పు వచ్చిందని, ఇప్పుడు ఆయన బీజేపీకి నమ్మకమైన సైనికుడిగా మారారని ఆరోపించారు.

Scroll to load tweet…

ఈ తాజా ఇంటర్వ్యూలో గులాం నబీ ఆజాద్ మరోసారి రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. జీ-23 ఏర్పాటయిన తర్వాత రాహుల్ గాంధీ తనను బీజేపీతో అనుసంధానం చేయడం ప్రారంభించారని చెప్పారు. 'పూర్తి స్థాయి అధ్యక్షుడిని కోరుతూ మేము లేఖ రాసిన తర్వాత, వారు కలత చెందారు.. అది ప్రధాని మోడీ ఆదేశాల మేరకు రాసినట్లు అబద్ధాన్ని వ్యాప్తి చేశారు. అబద్ధాలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుండి, పార్టీ నాయకుడి నుండి ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ను బలోపేతం చేయమని మమ్మల్ని కోరేంత వెర్రివాన్ని కాద‌నీ' పేర్కొన్నారు.

"గులాం నబీని ఎవరూ డిక్టేట్ చేయలేరు. నాపై కేసు లేదు, ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా లేదు. నా దగ్గర సంపద లేదు. నేను ఎవరికైనా ఎందుకు భయపడాలి?" బీజేపీతో సంబంధంతోనే ఆయ‌న ఇలా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న ఇలా స్పందించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా 7 ఏళ్లుగా ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలను విమర్శించాన‌నీ, తనపై ఎలాంటి అవినీతి కేసు, ఎఫ్‌ఐఆర్‌లు లేవని, ఎవరికీ భయపడలేదన్నారు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే నేను వ్యక్తిగత దాడులు చేయను అని అన్నారు.

కాగా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గులాం నబీ ఆజాద్ తన రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు . ఆదివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. 10 రోజుల్లో తన కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పారు. “ఏం చేయగలమో, చేయలేదో ఆజాద్‌కు తెలుసు. నేను లేదా కాంగ్రెస్ పార్టీ లేదా మూడు ప్రాంతీయ పార్టీలు మీకు ఆర్టికల్ 370ని తిరిగి ఇవ్వలేవు, (టీఎంసీ అధినేత్రి) మమతా బెనర్జీ లేదా డీఎంకే లేదా (ఎన్సీపీ చీఫ్) శరద్ పవార్ కూడా మీకు ఇవ్వలేరు. కొందరు అంటున్నారు. ఆర్టికల్ 370 గురించి నేను మాట్లాడను అనీ, కానీ ఎన్నికల ప్రయోజనాల కోసం ఆజాద్ ప్రజలను మోసం చేయరని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను” అని ర్యాలీలో గులాం న‌బీ ఆజాద్ పేర్కొన్నారు.