అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేయడం, రాష్ట్రంలో కేంద్ర బలగాల మోహరింపు తదితర అంశాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రజలు ఆందోళనకు గురికావొద్దని ఆయన పిలుపునిచ్చారు.

ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్న కారణంగానే భారీగా కేంద్ర బలగాలను మోహరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ అంశంలో రాజకీయ నాయకులు సంయమనంతో ఉండాలని మాలిక్ సూచించారు.

అంతకుముందు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా గవర్నర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమర్‌నాథ్ యాత్రికులను అర్థాంతరంగా ఎందుకు వెళ్లమన్నారో ప్రకటన చేయాలని అబ్ధుల్లా డిమాండ్ చేశారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే దీనిపై కేంద్రప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఒమర్ కోరారు. మరోవైపు అమర్‌నాథ్ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో యాత్రికులను వెనక్కి రావాల్సిందిగా ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే కశ్మీర్‌కు 35 వేలమంది కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అయితే బలగాల రాకతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.