జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని జమోడా సమీపంలో  కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని జమోడా సమీపంలో కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు శ్రీనగర్‌కు వెళుతుండగా వారి ఎస్‌యూవీ వాహనం జమోడా సమీపంలో ఒక లోయలో పడిపోయింది. లోయలో పడిపోయిన ఎస్‌యూవీలో మొత్తం ఆరుగురు ఉన్నారు. వాహనం నెంబర్ JK01U-2233 గా గుర్తించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

మృతులు అనంత్ నాగ్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తించినట్టుగా స్థానిక మీడియా తెలిపింది. మృతులను బ్రహ్ రాణిపోరా గ్రామానికి చెందిన గుల్జార్ అహ్మద్ భట్ (71), అతని భార్య జైనా బేగం (65), వారి కుమారుడు ఇక్బాల్ అహ్మద్ భట్ (25), కుమార్తె మస్రత్ జాన్ (21)గా గుర్తించారు. డ్రైవర్‌ను అనంత్‌నాగ్ నివాసి సాకిబ్‌గా గుర్తించారు.