జమ్మూ కాశ్మీర్ లో శనివారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది చనిపోయాడు. ఈ కాల్పులు అనంత్‌నాగ్ జిల్లాలోని సిర్హామాలో చోటు చేసుకున్నాయి. 

దక్షిణ కాశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలోని సిర్హామా ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ నిసార్ దార్ హతమయ్యాడు. ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారం రావ‌డంతో పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఆ ప్రాంతంలో శ‌నివారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ స‌మ‌యంలోనే ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

అయితే అనంత్‌నాగ్‌లోని సిర్హామా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంద‌ని, పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప‌నిలో ఉన్నాయ‌ని జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశంలో భద్రతా బలగాలు సున్నితంగా కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభ‌మైంద‌ని పేర్కొన్నారు. కాగా ముందు జాగ్రత్త చర్యల కోసం అనంతనాగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.

బుధవారం పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులను అన్సార్ ఘజ్వతుల్ హింద్‌కు చెందిన సఫత్ ముజఫర్ సోఫీ, లష్కరే తాయిబాకు చెందిన ఉమర్ తేలీగా గుర్తించారు. 

ఇది ఇలా ఉండ‌గా మార్చి 31వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలోని తుర్క్‌వాంగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భ‌ద్ర‌తా ద‌ళాల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఓ గుర్తుతెలియ‌ని ఉగ్ర‌వాది హ‌తమ‌య్యాడు. దీనిని జ‌మ్మూ కాశ్మీర్ జోన్ పోలీసులు నిర్దారించారు. 

ఇదే షోపియాన్ లోని జైనాపోరా ప్రాంతంలోని చెర్‌మార్గ్‌లో ఫిబ్రవరి 19వ తేదీన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు కూడా వీర మ‌ర‌ణం పొందారు. షోపియాన్‌లోని చెర్‌మార్గ్ జైనపోరా గ్రామంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి అందిన స‌మాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో పోలీసులు, 1వ రాష్ట్రీయ రైఫిల్స్, 178 CRPF బెటాలియన్ సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అనంత‌రం జ‌రిగిన కాల్పుల్లో ఒక ఉగ్ర‌వాది మృతి చెందాడు. కాగా జనవరి 2022 నుంచి ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమైనట్లు సమాచారం.