Asianet News TeluguAsianet News Telugu

ఆజాద్‌కు దెబ్బ‌కు.. జ‌మ్మూ కాశ్మీర్ కాంగ్రెస్‌కు కష్టాలు.. మ‌రో 42 మంది నేతల రాజీనామా!

కాంగ్రెస్ మాజీ సీనియ‌ర్ నేత‌ గులాం నబీ ఆజాద్ పార్టీని వీడిన తర్వాత ఆయనకు మద్దతుగా ప‌లువురు అగ్ర‌నేత‌లు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్ప‌టికే ఆయ‌న‌కు మద్దతుగా మంగళవారం 65 మంది నేతలు పార్టీకి రాజీనామా చేయ‌గా... త‌ర్వ‌లో 42 మంది నేతలు పార్టీని వీడ‌టానికి స‌న్నాహాకాలు  ప్రారంభించారు. 
 

Jammu And Kashmir Congress in TROUBLE, 42 more leaders resign in support of Ghulam Nabi Azad
Author
First Published Aug 31, 2022, 12:01 PM IST

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయ‌డంతో జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ త‌గిలింది. ఇప్పటికే అగ్రనేత ఆజాద్ మ‌ద్ద‌తుగా ప‌లువురు రాష్ట్ర‌ సీనియ‌ర్ నేత‌లు కాంగ్రెస్ పార్టీకి స్వ‌స్తి ప‌లికారు. తాజా మ‌రో 42 మంది నేతలు పార్టీకి రాజీనామా చేసి ఆజాద్ ఏర్పాటు చేయ‌నున్న నూత‌న‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. గులాం న‌బీ ఆజాద్ కు మ‌ద్ద‌తుగా ఇప్ప‌టి వరకు 64 మంది నేతలు పార్టీని వీడారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా రాజీనామా చేసిన వారిలో జమ్మూ కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.  

అస‌మ్మ‌తి నేతలంతా త‌న‌ రాజీనామా లేఖ‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి  సమర్పించారు. రాజీనామా చేసిన వారిలో ప్రధానంగా తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్‌ సహా పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీలోని వివిధ ప‌దవుల‌కు కూడా రాజీనామా చేశారు. 

జ‌మ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన గులాం నబీ.. కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఐదు దశాబ్దాల అనుబంధాన్నివిడిపెట్టారు. గ‌త శుక్రవారం నాడు త‌న రాజీనామాను సోనియా గాంధీకి అంద‌జేశారు. ఈ స‌మ‌యంలో రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయ‌న వల్లే.. కాంగ్రెస్ పూర్తిగా నాశనం అయిందని, పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని కూల్చివేశారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. త్వ‌ర‌లో తాను జాతీయ స్థాయి పార్టీని ప్రారంభిస్తానని ప్ర‌క‌టించారు

ఈ నేప‌థ్యంలో గులాం నబీ ఆజాద్ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సెప్టెంబర్ 4న జమ్మూలోని సైనిక్‌ ఫామ్స్‌లో జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ఇది ఆయన తొలి బహిరంగ కార్యక్రమం కావ‌డంతో స‌ర్వ‌తా ఆస‌క్తి నెల‌కొంది. ఈ స‌భ‌లోనే ఆయన తన పార్టీని ప్రకటించే అవకాశం ఉందని ప‌లువురు భావిస్తున్నారు. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సెప్టెంబర్ 4న ఢిల్లీలో జరిగే 'మెహంగై పర్ హల్లా బోల్' ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గులాం నబీ ఆజాద్ మ‌ద్ద‌తుగా ఏమైనా నిర‌స‌న‌లు 
వెల్లువెత్తాయ‌నే అనుమానాలు వ‌స్తున్నాయి. 

ఇది ప్రారంభం మాత్రమేనని రాజీనామా అనంతరం ఆజాద్ అన్నారు. దీంతో రానున్న రోజుల్లో ఆయన వైపు నుంచి కాంగ్రెస్‌పై దాడులు పెరిగే అవకాశం ఉందని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ త‌రుణంలో వచ్చే ఏడాది జ‌రుగనున్న‌ జమ్మూ కాశ్మీర్ ఎన్నిక‌ల్లో  గులాం నబీ ఆజాద్ మద్దతుదారులు ఆయన పార్టీ మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

రాబోయే రోజుల్లో గులాం నబీ ఆజాద్ తిరుగుబాటు జమ్మూ కాశ్మీర్ వెలుపల కూడా జ‌రిగే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తుంది. మంగళవారం నాడు ఢిల్లీలో ఆజాద్‌ను భూపీందర్ సింగ్ హుడా, ఆనంద్ శర్మ వంటి ప్రముఖ కాంగ్రెస్ సభ్యులు కలిశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆజాద్ ను క‌ల‌వ‌డంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలే అవ‌కాశ‌మున్న‌ట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే హిమాచల్ ప్రదేశ్ ప్రచార కమిటీ అధ్యక్ష పదవికి ఆనంద్ శర్మ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. 

జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,ప్రముఖ నాయకుల రాజీనామాలు చేస్తున్న తీరు చూస్తూంటే.. కేంద్ర పాలిత ప్రాంతంలో పార్టీని కాపాడుకోవడం సవాల్‌గా మారింది. ఆజాద్ దెబ్బకు రాబోయే రోజుల్లో జ‌మ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడే అవ‌కాశ‌మున్న‌ట్టు రాజ‌కీయ పండితులు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios