భారత స్వాతంత్య్ర సమరంలో మాయని మచ్చగా మిగిలిపోయిన జలియన్ వాలాబాగ్ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోడీ నివాళి అర్పించారు. నేటితో ఆ నరమేధం జరిగి 102 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు
భారత స్వాతంత్య్ర సమరంలో మాయని మచ్చగా మిగిలిపోయిన జలియన్ వాలాబాగ్ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోడీ నివాళి అర్పించారు. నేటితో ఆ నరమేధం జరిగి 102 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు. ‘జలియన్ వాలాబాగ్‌లో అమరులైన వారికి నా నివాళులు... వారి ధైర్యం, సాహసం, త్యాగం ప్రతి భారతీయ పౌరునిలో శక్తిని పెంపొందిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ట్విటర్ వేదికగా జలియన్ వాలాబాగ్ అమరవీరులకు నివాళి అర్పించారు. ‘అమరులకు నా నివాళులు. ఎన్నేళ్లు గడిచినా ఆ చేదు ఘటన ప్రతి ఒక్క భారతీయుడి గుండెలో మెదులుతుంటుంది. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని వెంకయ్య ట్వీట్ చేశారు.
జలియన్ వాలాబాగ్ మారణకాండ ఏప్రిల్ 13, 1919లో జరిగింది. బ్రిటిష్ పాలకులు తెచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టిన సఫియుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ అనే ఇద్దరు నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
వారిని విడుదల చేయాలని ప్రజలు డిమాండు చేశారు. వైశాఖి పర్వదినం నేపథ్యంలో జలియన్ వాలాబాగ్‌లో ప్రజలు సమావేశమయ్యారు. జనాలు గుంపులుగా సమావేశం కావడంపై కోపోద్రిక్తుడైన బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించాడు.
దీంతో బ్రిటీష్ సైన్యం విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 500 పైగా అమాయక పౌరులు మరణించారని అంచనా. వీరిలో 8 నెలల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుడు వరకు వున్నారు. ఈ దారుణానికి బాధ్యుడైన జనరల్ డయ్యర్‌ను గదర్ పార్టీకి చెందిన ఉదమ్ సింగ్ లండన్ వెళ్లి మరి హత్య చేశాడు.
