జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ రాజీనామా.. ఆమోదించిన పోప్ ఫ్రాన్సిస్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నన్‌పై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ రాజీనామా చేశారు. దీనిని పోప్ ఫ్రాన్సిస్ ఆమోదించారు. ఈ కేసులో స్థానిక కోర్టు నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ , ములక్కల్‌కు చర్చిలో ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించలేదు.

అత్యాచారం ఆరోపణలపై 2018లో పాస్టోరల్ విధుల నుంచి తాత్కాలికంగా రిలీవ్ అయిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పోప్ ఫ్రాన్సిస్ ఆమోదించారు. ఇకపై ఫ్రాంకోని బిషప్ ఎమెరిటస్ అని పిలుస్తారు. ఫ్రాంకో మినిస్ట్రీపై ఎటువంటి చట్టబద్ధమైన ఆంక్షలు ఉండవని, భారతదేశంలో వాటికన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హోలీ సీ టు ఇండియా అపోస్టోలిక్ న్యూన్సియేచర్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రతికా ప్రకటన విడుదల చేసింది. అయితే వ్యాజ్యం నుండి అతనిని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన అప్పీల్‌ను హైకోర్టు అంగీకరించింది. అదనంగా, ములక్కల్ రాజీనామాను "పర్ బోనో ఎక్లేసియా" కోసం అడిగారని, ప్రత్యేకించి కొత్త బిషప్ అవసరం ఉన్న డియోసెస్ కొరకు కోరినట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
కాగా.. జలంధర్ బిషప్‌గా వున్న సమయంలో ఫ్రాంకో ములక్కల్ తరచు కొట్టాయంకు వచ్చేవారు. ఈ సమయంలో ఆయన ఓ నన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 2014 నుంచి 2016 మధ్యకాలంలో ఆమెపై అత్యాచారం చేసినట్లుగా ఫ్రాంకోపై ఆరోపణలు వున్నాయి. ఈ కేసుకు సంబంధించి గతేడాది కేరళలోని స్థానిక కోర్ట్ ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో వాటికన్‌లో పోప్ ప్రాన్సిస్‌ను కలిశారు. అత్యాచారం కేసులో కొట్టాయం అదనపు జిల్లా అండ్ సెషన్స్ కోర్ట్ 1 అతనిని నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత పోప్‌తో ఫ్రాంకోకు ఇదే తొలి సమావేశం.
సెప్టెంబర్ 2018లో..సన్యాసిని మోపిన అత్యాచార ఆరోపణలపై కేరళ పోలీసులు ములక్కల్‌ను విచారించిన తర్వాత, పోప్ ఫ్రాన్సిస్ డియోసెస్‌లో బిషప్‌ను తాత్కాలికంగా తన బాధ్యతల నుండి తప్పించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో స్థానిక కోర్టు నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ , ములక్కల్‌కు చర్చిలో ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించలేదు. అటు అత్యాచారం ఆరోపణల నుంచి అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ వాటికన్.. గతంలో కోర్టు నిర్ణయాన్ని అంగీకరించింది.
అయితే బిషప్ తనపై అత్యాచారం చేశాడని పేర్కొన్న సన్యాసిని ట్రయల్ కోర్టు ఈ కేసులో ఆయనను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. సదరు నన్ జలంధర్ డియోసెస్ పరిధిలోని మిషనరీస్ ఆఫ్ జీసస్ అనే డియోసిసన్ సమ్మేళనంలో సభ్యురాలు.