శ్రీనగర్‌: భారత సైన్యం ఉగ్రమూకల ఏరివేతలో జోరు పెంచింది. శనివారం దక్షిణ కశ్మీర్ లోని  షోపియాన్ జిల్లాలో భారత సైన్యం జరిపిన ఎన్ కౌంటర్లో పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ సంస్థ కమాండర్ మున్నా లాహోరి హతమయ్యాడు. 

మున్నా లాహోరితోపాటు మరోక స్థానిక ఉగ్రవాది సైతం ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. హతమైన మరో ఉగ్రవాది తుర్కవాంగంకు చెందిన జినాతుల్ ఇస్లామ్ గా పోలీసులు గుర్తించారు. 
 
షోపియాన్‌ జిల్లా షోపియాన్ టౌన్ లోని బండే మోహల్లా బన్‌ బజార్‌ లో ఉగ్రవాదుల ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా భద్రతా దళాలకు సమాచారం అందింది. దాంతో అప్రమత్తమైన భద్రతా దళాలు జమ్ముకశ్మీర్ పోలీసులతో కలిసి ఆ ప్రాంతాన్ని రాత్రి నుంచే తమ ఆధీనంలోకి తీసుకుంది. 

అనంతరం ఆ ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక్కో ఇంటిని తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులుపై కాల్పులు జరిపారు. పోలీసులు సైతం వారిపై ఎదురుకాల్పులు నిర్వహించి ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు.

ముష్కరులు కాల్పులు జరిపిన ఘటనా స్థలంలో ఆయుధాలు మందుగుండు సామాగ్రిని పోలీసులు, భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతిచెందిన వారిలో ఒకరు నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహ్మద్ సంస్థ టాప్ కమాండర్ మున్నా లాహోరిగా భద్రతా దళాలు గుర్తించాయి. 

పాకిస్థాన్‌కు చెందిన 19ఏళ్ల మున్నా జైషే సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేయడం మున్నా లాహోరి వృత్తి. 19ఏళ్ల మున్నా లాహోరీ గతంలో అనేక నేరాలకు పాల్పడ్డాడు. మున్నా ఐఈడీలను పేల్చడంలో దిట్ట అని భద్రతా దళాలు స్పష్టం చేశాయి.

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై పుల్వామాలో జరిగిన దాడి ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో జూన్ 17న 44 రాష్ట్రీయ రైఫిల్స్ పై ఐఈడీతో దాడి జరిగింది. ఈ దాడిలో తొమ్మిది మంది జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఆ దాడిలో కీలకంగా వ్యవహరించింది మున్నా లాహోరి అని నిర్ధారించారు.  

ఐఈడీలను వాహనాలకు అమర్చడంలో 19ఏళ్ల లాహోరీ దిట్ట అని భద్రతా దళాలు స్పష్టం చేస్తున్నాయి. మున్నా లాహోరి 2018లో పాకిస్థాన్ నుంచి దక్షిణ కశ్మీర్ లోకి వచ్చాడు. అప్పటి నుంచి పుల్వామా-షోపియాన్ ల మధ్యలో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేయడంతోపాటు వారికి ఉగ్రశిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాడు. ఇతడి శిక్షణలో చాలా మందికి స్థానికంగా దొరికే పరికరాలతో ఐఈడీలను ఎలా తయారు చేయాలో అనే అంశంపై శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.