Asianet News TeluguAsianet News Telugu

Amendment to Flag Code: "వారి జీవనోపాధిని నాశనం చేస్తున్నారు".. ఫ్లాగ్ కోడ్ సవరణపై జైరాం రమేష్ ఆగ్ర‌హం

Amendment to Flag Code: ఇటీవ‌ల కేంద్రప్ర‌భుత్వం చేసిన ఫ్లాగ్ కోడ్‌కు సవరణపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మండిపడ్డారు. ఖాదీతో జాతీయ జెండాలు తయారు చేసే వారి జీవనోపాధిని కేంద్రం నాశనం చేస్తోందని ఆరోపించారు. 

Jairam Ramesh hits out at PM Modi over amendment to flag code
Author
Hyderabad, First Published Jul 22, 2022, 1:22 PM IST

Amendment to Flag Code: ఇటీవ‌ల కేంద్రప్ర‌భుత్వం చేసిన ఫ్లాగ్ కోడ్‌కు సవరణపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మండిపడ్డారు. పాలిస్టర్‌తో జెండాల తయారీ తోపాటు జెండాల‌ దిగుమతికి అనుమతించేలా జాతీయ జెండా కోడ్‌కు సవరణ చేయడంపై  జైరాం రమేష్ మండిపడ్డారు.  జాతీయ జెండాపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌పై రమేష్ స్పందిస్తూ.. ఖాదీతో జాతీయ జెండాలను తయారు చేసిన వారి జీవనోపాధిని నాశనం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 1947లో ఇదే రోజున జాతీయ జెండాను ఆమోదించారు. నాగ్‌పూర్‌లో జాతీయ జెండాను ఎగురవేయడానికి 52 సంవత్సరాలు పట్టిన సంస్థకు ఆయన (పీఎం మోడీ) ప్రచారకర్తగా ఉన్నారని జైరాం రమేష్ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారు.
 
హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమంలో భాగంగా..  ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాల‌ని ప్ర‌ధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో.. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భాన్ని పురస్క‌రించుకుని ప్ర‌ధాని మోడీ వ‌రుస‌ ట్వీట్లు చేశారు. హర్‌ ఘర్‌ తిరంగా మూమెంట్ జాతీయ‌ పతాకంతో భారతీయుల‌కు ఉన్న‌  అనుబంధాన్ని మరింత పెంచుతుందని ప్ర‌ధాని మోదీ అన్నారు. అంతేకాకుండా.. వలస పాలనకు వ్య‌తిరేకంగా స్వేచ్ఛా భారతం కోసం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, వారి  కృషిని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు.  అయితే.. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల‌ ఆశయాలను నెరవేర్చేందుకు త‌మ ప్ర‌భుత్వం   కట్టుబడి ఉందని తెలిపారు. ఈనేపథ్యంలో.. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు 

సాంప్రదాయ హ్యాండ్ లూమ్, చేతితో నేసిన ఖాదీతో పాటు, పాలిస్టర్, ఇతర మెషిన్-మేడ్ ఫ్యాబ్రిక్‌లతో తయారు చేయిన జాతీయ ప‌తాకాల‌ను అనుమతిస్తూ 2002 ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించాలని కేంద్రం నిర్ణయించింది. ఫ్లాగ్ కోడ్ సవరణను ఖాదీ ప్రతిపాదకులు ప్రశ్నించారు, జాతీయ జెండా, భారత స్వాతంత్య్ర‌ ఉద్యమం, ఖాదీకి మధ్య ఉన్న అనుబంధాన్ని తెంచుతుందని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఈ సవరణను ఉపసంహరించుకోవాలని కర్ణాటక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం కూడా తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios