జైపూర్: జైపూర్ శివారులోని చక్సులో ఎనిమిదితో తరగతి విద్యార్థిని బుధవారం హత్యకు గురైంది. పరీక్షలు రాయడానికి ఇంటి నుంచి వెళ్లి ఆ తర్వాత బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. గురువారంనాడు గాయాలతో ఆమె శవం కనిపించింది. 

పెన్ను కోసం పదేళ్ల బాలిక ఆ బాలికను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పరీక్షలు రాయడానికి వెళ్లిన బాలికతో పెన్ను కోసం పదేళ్ల బాలిక గొడవ పడింది. పరీక్ష పూర్తియిన తర్వాత మృతురాలు ఇంటికి వెళ్లి యూనిఫారం మార్చుకుని తనతో గొడవ పడిన బాలికతో విషయం తేల్చుకోవడానికి వెళ్లింది. 

మృతురాలు బాలిక ఇంటికి వెళ్లి ఘర్షణ పడింది. దాంతో ఆ బాలిక మృతురాలిపై ఇనుప రాడ్ తో దాడి చేసింది. తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న బాలిక పోలీసులకు సమాచారం ఇస్తానంటూ అక్కడి నుంచి బయలుదేరింది. 

దాంతో భయపడిన పదేళ్ల బాలిక పదునైన ఆయుధాన్ని తీసుకుని బాలికపై దాడి చేసింది. దాదాపు 19 సార్లు మృతురాలిపై ఆ బాలిక దాడి చేసింది. దాంతో ఆమె మరణించింది. బాలిక చనిపోవడంతో భయపడిన పదేళ్ల అమ్మాయి సంఘటనా స్థలాన్ని శుభ్రం చేసి శవాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ తో కప్పేసింది. 

ఎన్ఆర్ఈజిఎలో పనిచేస్తున్న తల్లి తిరిగి వచ్చిన తర్వాత హత్య గురించి చెప్పింది. దాంతో నేరాన్ని కప్పిపుచ్చడానికి తల్లి ప్రయత్నించింది. గ్రామమంతా అదృశ్యమైన బాలిక కోసం వెతకడం ప్రారంభించింది. 

దాంతో తల్లికూతుళ్లు కలిసి బాలిక శవాన్ని సంచీలో పెట్టి సమీపంలోని బావిలో పడేశారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత నిందితురాలైన బాలిక తల్లి విషయాన్ని తన భర్తకు చెప్పింది. అతను కూడా నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు.

శవం తమ ఇంటి సమీపంలో కనిపిస్తే తమను అనుమానిస్తారనే ఉద్దేశంతో బావిలో నుంచి భార్యాభర్తలు శవాన్ని తీసి తమ ఇంటికి చాలా దూరంలో పడేశారు. గురువారం శవాన్ని చూసిన పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

హత్య చేసిన బాలికను పోలీసులు అరెస్టు చేశారు. నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన ఆమె తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి సమీపంలో రక్తం మరకలు కనిపించడంతో పోలీసులు అనుమానించి క్లాస్ మెట్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు.