కాలేజీ ఫెస్ట్ లో ‘జై శ్రీరామ్’ నినాదాలు.. వేదిక నుంచి దిగిపోవాలని ప్రొఫెసర్ హుకుం.. వీడియో వైరల్
కాలేజీ ఫెస్ట్ లో వేదికపై ఓ విద్యార్థి జై శ్రీరాం నినాదాలు చేశారు. దీంతో ఓ మహిళా ప్రొఫెసర్ ఆ యువకుడిని స్టేజీ పై నుంచి కిందికి దిగిపోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లోని ఓ కాలేజీలో నిర్వహించిన ఫెస్ట్ లో వేదికపై ఓ విద్యార్థి ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. దీంతో ఆ విద్యార్థిపై ప్రొఫెసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజీపై నుంచి దిగి పోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఘజియాబాద్ లోని ఏబీఈఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల కల్చరల్ ఫెస్ట్ లో నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కొంత సమయం తరువాత ఓ విద్యార్థి స్టేజీ పైకి ఎక్కాడు. దీంతో సభికుల్లోని కొందరు విద్యార్థులు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. దానికి ప్రతిస్పందనగా వేదికపై ఉన్న విద్యార్థి మైక్ తీసుకొని జై శ్రీరామ్ అంటూ నినదించారు. వెంటనే ఆడిటోరియం మొత్తం ఏకమై నినాదాన్ని కోరస్ గా జపించింది.
దీంతో అక్కడే ఉన్న ఓ మహిళా ప్రొఫెసర్ వేదికపై ఉన్న విద్యార్థినిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమం కాబట్టి ఇలాంటి నినాదాలు చేయొద్దని చెప్పారు. కొంత సమయం తరువాత మరో ప్రొఫెసర్ తన సహోద్యోగికి మద్దతుగా ముందుకు వచ్చాుు. కల్చరల్ ఫెస్ట్ లో ఎలాంటి నినాదాలు చేయొద్దని విద్యార్థులకు వివరించారు. ఏదో సాంస్కృతిక కార్యక్రమం కోసం, కొంత సమయం గడిపేందుకు ఇక్కడికి వచ్చామని, అలాంటప్పుడు జై శ్రీరామ్ నినాదాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనుక ఎలాంటి లాజిక్ లేదని, క్రమశిక్షణతో ఉంటేనే ఈ కార్యక్రమాలు విజయవంతమవుతాయని అన్నారు.
అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాలేజీ బయటకు పోలీసులు వాహనాలతో మోహరించారు. ఈ ఘటనపై ఏబీఈఎస్ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఓ అంశంపై కొందరు విద్యార్థులు, అధ్యాపకులు మధ్య తలెత్తిన వివాదం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నాని పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. ఈ అంశంపై మితవాద సంస్థ హిందూ రక్షా దళ్ (హెచ్ఆర్డీ) అధ్యక్షురాలు పింకీ చౌదరి శనివారం కళాశాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ వీడియో ఘజియాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని క్రాసింగ్స్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ను ఆదేశించారు.