న్యూఢిల్లీ: ఇంట్లో ఉన్నా కూడ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిందేనని కేంద్ర  కేంద్ర ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది.దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను  మాస్క్‌లు పనిచేస్తాయని  కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాడు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్  మీడియాతో మాట్లాడారు. 

పీరియడ్స్ సమయంలో కూడ మహిళలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రుల్లో చేరాలని అగర్వాల్ సూచించారు. దేశంలో ఆక్సిజన్ కు ఇబ్బంది లేదన్నారు. అయితే  అవసరమైన చోటుకి ఆక్సిజన్ ను సరఫరా చేయడమే ప్రధాన అడ్డంకిగా మారిందని ఆయన వివరించారు. అవసరం ఉన్న రోగులకు మాత్రమే ఆక్సిజన్ తో పాటు రెమిడెసివర్ లాంటివి ఉపయోగించాలని ఆయన వైద్యులను కోరారు. అవసరం లేకున్నా రెమిడెసివర్ తో పాటు ఆక్సిజన్ ఉపయోగించడం వల్ల  ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఏడాది మే 1 నుండి  మూడో విడత వ్యాక్సినేషన్  ప్రక్రియను కేంద్రం ప్రారంభించనుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో  భాగంగా  18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కూడ వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.