ఇది విజయం మాత్రమే కాదు.. పెద్ద బాధ్యత : ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మనీష్ సిసోడియా
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా హర్షం వ్యక్తం చేశారు. తమపై ఢిల్లీ ప్రజలు పెద్ద బాధ్యతను మోపారని అన్నారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

ఢిల్లీ మున్పిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతూ సగం కంటే అధిక స్థానాలు గెలుచుకున్న సమయంలో ఆ పార్టీ నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్విట్టర్ వేధికగా స్పందించారు. ‘‘ఇది కేవలం విజయం కాదు, పెద్ద బాధ్యత’’ అని ట్వీట్ చేశారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు.. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికం.. షాకింగ్ డేటా..
ఢిల్లీ వాసులకు ధన్యవాదాలు తెలుపుతూ ‘‘ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని విశ్వసించినందుకు ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నగరవాసులు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతికూల పార్టీని ఓడించారు. నిజాయితీ గల అరవింద్ కేజ్రీవాల్ గెలుపును నిర్ధారించారు.’’ అని ఢిల్లీ డిప్యూటీ సీఎం హిందీలో ట్వీట్ చేశారు.
కాగా.. 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌పై జెండా ఎగురవేసిన బీజేపీని తాజాగా ఎన్నికల ఫలితాలు నిరాశపర్చాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడు సార్లు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించినా.. మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ హవానే కొనసాగింది. కానీ ఇప్పుడు తొలిసారిగా ఆప్ మున్సిపాలిటీలపై పట్టు సాధించింది. ఢిల్లీలో కొన్ని నెలల కిందట మూడు మునిసిపల్ బాడీలను కలిపి ఒకటిగా ఏర్పాటు చేశారు. వార్డులను సంఖ్యను 272 నుండి 250కి తగ్గించారు. ఈ పరిణామాలు చోటు చేసుకున్న తరువాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి.
కాగా.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాఘవ్ చద్దా కూడా స్వాగతించారు. ‘‘ధన్యవాదాలు, ఢిల్లీ! ఎంసీడీ ఎన్నికలలో ఆప్ విజయం అరవింద్ కేజ్రీవాల్ జీ నాయకత్వం, దార్శనికతపై మీ విశ్వాసానికి ప్రతిబింబం. ఉదాసీనత, అబద్ధాలు, బురద చల్లే రాజకీయాలతో ఢిల్లీని నాశనం చేయాలని చూస్తున్న వారిపై ఇది మీ విజయం. క్లీనర్, గ్రీన్ ఢిల్లీకి ఇదిగో ’’అని చద్దా ట్వీట్ చేశారు.