కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ న్యూఢిల్లీకి వెళ్లే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
బెంగుళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ న్యూఢిల్లీ పర్యటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఢీల్లీ బయలుదేరి వెళ్లారు.
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో కాంగ్రెస్ పార్టీ నేత సూర్జేవాలా సోమవారంనాడు బెంగుళూరులోని ఓ హోటల్ లో సంప్రదింపులు జరిపారు. మూడు గంటల పాటు సూర్జేవాలా డీకే శివకుమార్ తో చర్చలు జరిపారు. డీకే శివకుమార్ ను కూడా ఢీల్లీకి రావాలని కాంగ్రెస్ నాయకత్వం కోరింది.
ఇవాళ డీకే శివకుమార్ పుట్టిన రోజు. దీంతో తాను ఢిల్లీ వెళ్లాలా వద్దా అనే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదని డీకే శివకుమార్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది తన కోసం వస్తున్నారన్నారు. అంతేకాదు కొన్ని పూజలు, దేవాలయాలకు వెళ్లాల్సి ఉందని డీకే శివకుమార్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా డీకే శివకుమార్ కు పేరుంది. కర్ణాటక సీఎం పదవిని డీకే శివకుమార్ ఆశిస్తున్నారు. కానీ సీఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్దరామయ్య వైపే ఉన్నారు. ఇది డీకే శివకుమార్ కు నిరాశను కల్గించింది. కాంగ్రెస్ నాయకత్వం పంపిన పరిశీలకులు కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ నాయకత్వానికి వివరించనున్నారు. ఇప్పటికే పరిశీలకుల బృందం న్యూఢిల్లీకి చేరింది. పరిశీలకుల బృందం మల్లికార్జున ఖర్గేతో ఇవాళ భేటీ కానుంది.
తనకు సీఎం పదవిని ఇవ్వాలని లేకపోతే మంత్రి పదవి కూడా అవసరం లేదని డీకే శివకుమార్ పార్టీ పరిశీలకుల బృందానికి తేల్చి చెప్పినట్టుగా సమాచారం. కర్ణాటక సీఎం పదవి ఎవరిని వరిస్తుందో తేలడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. సిద్దరామయ్యకే సీఎం పదవిని కట్టబెడితే డీకే శివకుమార్ ను కాంగ్రెస్ నాయకత్వం ఎలా సంతృప్తి పరుస్తుందనే విషయమై తేలాల్సి ఉంది. డీకే శివకుమార్ పై కేసులున్నాయి. ఈ నెల 30న డీకే శివకుమార్ కేసు విచారణ ఉంది. కేసుల అంశాన్ని ప్రత్యర్ధులు సాకుగా చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే డీకే శివకుమార్ పై ఉన్న కేసులు ఆయనకు సీఎం పదవిని కట్టబెట్టేందుకు అడ్డంకి కాదని ఎఐసీసీ ఇంచార్జీ , మాజీ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం ఐదు గంటల తర్వాత డీకే శివకుమార్ బెంగుళూరు నుండి న్యూఢిల్లీకి వెళ్లనున్నారనే ప్రచారం కూడా సాగుతుంది.
