తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ట్రెజరర్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ట్రెజరర్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

ట్రెజరర్ చంద్రశేఖర్ ఇళ్లు, కుటుంబసభ్యుల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ శాఖ సోదాలు జరిపింది. పెద్ద ఎత్తున డబ్బులు దాచి పెట్టారనే సమాచారంతో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహించింది. అనితా టెక్స్ కాట్ పేరుతో కంపెనీ నడుపుతున్నారు చంద్రశేఖర్ . 

కాగా, ఆదివారం.. కమల్‌హాసన్‌ కారుపై ఓ యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో కమల్‌హాసన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన రాత్రికి హోటల్‌లో బసచేసేందుకు బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది.

అనుకోకుండా ఓ యువకుడు కమల్ కారుపై దాడికి యత్నించాడు. కమల్‌హాసన్‌ వ్యక్తిగత బౌన్సర్లు, పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆ యువకుడు వెనక్కితగ్గలేదు. వారిని నెట్టుకుంటూ కారు పైకెక్కి.. కమల్‌హాసన్‌ కూర్చున్న వైపు అద్దాన్ని పగులగొట్టేందుకు యత్నించాడు.

అయితే, బుల్లెట్‌ప్రూఫ్‌ కావడంతో అద్దం దెబ్బతినలేదు. అనంతరం పార్టీ కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు కమల్ పార్టీలో కీలకంగా వున్న వ్యక్తి ఇంటిపై ఐటీ సోదాలు జరగడం తమిళనాట ప్రాధాన్యత సంతరించుకుంది.