గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కేవలం సోనియా గాంధీ కుటుంబాన్ని బాధ్యులను చేయడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం గులాం నబీ ఆజాద్ తీసుకుంటున్న చొరవ స్వాగతించదగినదని తెలిపారు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కేవలం గాంధీ కుటుంబాన్ని మాత్రమే నిందించడం సరికాదని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పునరుద్ఘాటించారు. ఈ పరాజయానికి పార్టీ నేతలందరూ బాధ్యత వహించాలని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇటీవలే జీ-23 నేతలను, ఆ తర్వాత సోనియా గాంధీని కలిసిన గులాం నబీ ఆజాద్ పార్టీని కలిపి ఉంచడం గురించి మాట్లాడారని, ఇది శుభపరిణామమని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇటీవల అసమ్మతి జీ-23 నాయకులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పును డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఖర్గే మాట్లాడుతూ.. “ పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కలిసి రావాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. అది మనందరి బాధ్యత. గాంధీ కుటుంబాన్ని మాత్రమే ప్రస్తావించడం సరికాదు. ఇదే విషయాన్ని చాలా మంది CWC సమావేశంలో కూడా ప్రస్తావించారు’’ అని అన్నారు.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో గులాం నబీ ఆజాద్ భేటీ విషయంలో ఖర్గే మాట్లాడుతూ.. ఆయన పార్టీలో ఏళ్ల తరబడి ఉన్నారని, ఆజాద్ కు అన్నీ తెలుసు కాబట్టి అసమ్మతి నేతలతో మాట్లాడారని తెలిపారు. ‘‘ గులాం నబీ ఆజాద్ సోనియా గాంధీని కలిశారు. పార్టీని కలిపి ఉంచడం విషయంలో ఆయన మాట్లాడారు. ఇది శుభపరిణామం. పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇది స్వాగతించదగిన విషయం.’’ అని ఖర్గే చెప్పారు.
అంతకుముందు శుక్రవారం గులాబ్ నబీ ఆజాద్ న్యూఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమె నివాసరంలో సమావేశమయ్యారు. ఐదు రాష్ట్రాలలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో నిరాశాజనకమైన ఫలితాలను కలిగి ఉండటం, పార్టీని బలోపేతం చేయడంపై అసమ్మతి G-23 గ్రూప్ సమావేశంలో చర్చించిన సూచనలను పంచుకున్నట్లు చెప్పారు. ‘‘ సోనియా గాంధీతో సమావేశం బాగుంది. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఆమె అధ్యక్షురాలిగా కొనసాగాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. సోనియా గాంధీ వైదొలగాలని ఎవరూ అనలేదు. మేము కొన్ని సలహాలను పంచుకున్నాము ’’ అని సమావేశం అనంతరం ఆజాద్ మీడియాతో తెలిపారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఓడించేందుకు ఐక్యంగా పోరాడాలని చర్చ జరిగిందని గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో సంస్థను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై సూచనలు కోరామని ఆయన తెలిపారు. కాగా పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవాలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పనితీరుపై చర్చించడానికి కాంగ్రెస్‌లో విస్తృతమైన సంస్కరణలకు పిలుపునిచ్చిన G-23 నాయకులు బుధవారం ఆజాద్ నివాసంలో సమావేశమయ్యారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దేశంలోనే అతి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో కాంగ్రెస్ పార్టీ రెండు అంకెల స్థానాలు కూడా సంపాదించలేదు. మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ లో కూడా పూర్తిగా చతికిలపడిపోయింది. పంజాబ్ లో అయితే అధికారాన్ని వదిలేసుకుంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మిగితా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.
