మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 8 మంది పోలీసులను అత్యంత పాశవికంగా హతమార్చి పారిపోయిన ఈ  కరుడుగట్టిన క్రిమినల్ ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఇతని ఆస్తులపై ఐటీ అధికారులు దృష్టిసారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

వికాస్ దూబే తక్కువ కాలంలో కోట్లాదిరూపాయల ఆస్తులు సంపాదించాడని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు సమాచారం అందింది. తక్కువ కాలంలో దూబే ఎలా కోట్లు గడించాడు అన్న దానిపై ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో దూబేను అరెస్టు చేయగానే, అతనితోపాటు అతని బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

ఆదాయపుపన్నుశాఖ పరిశోధన విభాగం అధికారులు దూబే బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. వికాస్ దూబే సన్నిహిత బంధువుల పేరిట దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు పలు దేశాల్లో  ఆస్తులున్నాయని వెల్లడైంది.దూబే 8 నెలల క్రితం లక్నో నగరంలో రూ.5కోట్లు వెచ్చించి ఓ భవనం కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

దీంతోపాటు బ్యాంకాంక్ నగరంలో ఓ హోటల్ లో వికాస్ దూబే పెట్టుబడి పెట్టాడని సమాచారం. వికాస్ దూబేకు 12 ఇళ్లు, 21 ఫ్లాట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దూబే సన్నిహితడి పేరిట ఆర్యనగర్ లో 28 కోట్ల ఆస్తులున్నాయని తేలింది. ఆర్యనగర్ లో దూబే సన్నిహితుడి పేరిట 8 ఫ్లాట్లు ఉన్నాయని, వీటి విలువ 5కోట్లరూపాయలుంటుందని తేల్చారు. 

కాన్పూర్ నగరంలోని పంకీ ప్రాంతంలో దూబేకు డూప్లెక్స్ బంగళా ఉంది. దీనివిలువ రూ.2కోట్లు అని పోలీసులు చెప్పారు. ఐటీ అధికారులు దూబేతోపాటు అతని బంధువులు, సన్నిహిత అనుచరుల పేరిట ఉన్న ఆస్తుల గురించి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.