చెన్నై: బినామీ ప్రొహిబిషన్ చట్టం కింద దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళకు చెందిన రూ. 300 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది.

జయలలితకు చెందిన వేద నిలయం నుండి షెల్ కంపెనీల ద్వారా ఒక స్థలంతో పాటు ఈ ఆస్తులను శశికళ కొనుగోలు చేసినట్టుగా ప్రచారంలో ఉంది.
బెంగుళూరులోని పరప్పర అగ్రహార జైలులో ఉన్న శశికళకు వివిధ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల ద్వారా నోటీసులు అందించినట్టుగా ఐటీ శాఖాధికారులు ప్రకటించారు.

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో శశికళ ప్రస్తుతం పరప్పర అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తోంది. శ్రీహరి చందన ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు మరో కంపెనీని 1995 మార్చి 9వ తేదీన ఏర్పాటు చేసినట్టుగా ఐటీ శాఖాధికారులు చెబుతున్నారు.

హైద్రాబాద్ బంజారాహిల్స్ లో రియల్ ఏస్టేట్ కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తున్నట్టుగా ఐటీ శాఖాధికారులు తేల్చారు.శ్రీహరిచందన్ ఏస్టేట్స్ ప్రైవేట్  లిమిటెడ్ ద్వారా 2003-05 మధ్య కాలంలో శశికళ 65 ఆస్తులను కొనుగోలు చేసింది. సుమారు 200 ఎకరాల్లో ఈ 65 రకాల ఆస్తులు ఉన్నాయని  ఐటీ శాఖ గుర్తించింది. ప్రస్తుతం వీటి విలువ రూ. 300 కోట్లు ఉంటుందని ఐటీ శాఖాధికారులు ప్రకటించారు.

కలియాపెరుమాల్, శివకుమార్ లు శశికళతో కలిసి పనిచేశారని ఐటీ శాఖాధికారులు గుర్తించారు.  జజ్జు సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మిదాస్ గోల్డెన్ డిస్టిబ్యూటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ద్వారా వ్యాపారం చేసినట్టుగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది.

 చెన్నై చుట్టు ఉన్న ఆస్తులను షెల్ కంపెనీలను ఉపయోగించి కొనుగోలు చేసినట్టుగా ఐటీ శాఖ ఈ నోటీసుల్లో పేర్కొంది.వేద నిలయానికి ఎదురుగా నిర్మిస్తున్న భవన స్థలం కూడ శశికళదేనని ఐటీ శాఖాధికారులు గుర్తించారు.

పోయెస్ గార్డెన్, అలందూర్, తాంబరం, శ్రీపెరంబుదూర్లలో ఆస్తులున్నాయి. ఆలందూర్ లో ఫ్యాక్టరీకి చెందిన కొంత భాగాన్ని శశికళ కొనుగోలు చేసినట్టుగా ఐటీ శాఖాధికారులు ఆరోపిస్తున్నారు.పెద్ద నోట్ల నగదు రద్దు తర్వాత శశికళ రూ. 1600 కోట్లకు తొమ్మిది ఆస్తులను బినామీ లావాదేవీలను చేసిందని ఐటీ శాఖ ఆరోపించింది.