రేపే నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ58.. ప్రయోగంతో కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్న ఇస్రో..
PSLV-C58 : కొత్త ప్రయోగంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇస్రో (ISRO) సిద్ధమైంది. శ్రీహరి కోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
EXPOSAT mission : వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపే ఈ కొత్త మిషన్ నింగిలోకి దూసుకుపోనుంది. కొత్త ఏడాదికి కొత్త ప్రయోగంతో ఇస్రో స్వాగతం పలుకుతూ, తన విజయప్రస్తానాన్ని కొనసాగించనుంది. కృష్ణబిలాలు వంటి ఖగోళ వస్తువులపై అవగాహన కల్పించే తొలి ఎక్స్ రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ ద్వారా ప్రయోగించనుంది.
ఈ ఏడాది అక్టోబర్ లో గగన్ యాన్ టెస్ట్ వెహికల్ డీ1 మిషన్ విజయవంతం కావడంతో ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ తన 60వ మిషన్ లో ప్రాథమిక పేలోడ్ ఎక్స్ పో శాట్ తో పాటు మరో 10 ఉపగ్రహాలను తక్కువ భూ కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.10 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ రోజు ఉదయం 8.10 గంటలకు పీఎస్ఎల్వీ-సీ58కి కౌంట్డౌన్ ప్రారంభమైందని ఇస్రో వర్గాలు తెలిపాయి.
ఎక్స్ రే పోలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్ పోశాట్) అంతరిక్షంలో తీవ్రమైన ఎక్స్-రే వనరుల పోలరైజేషన్ ను పరిశోధించడానికి ఉద్దేశించినది. ఖగోళ వనరుల నుంచి వెలువడే ఎక్స్ రే ఉద్గారాల అంతరిక్ష ఆధారిత పోలరైజేషన్ కొలతల్లో పరిశోధనలు చేపట్టిన తొలి శాస్త్రీయ ఉపగ్రహం ఇదేనని ఇస్రో తెలిపింది.
కాగా.. ఇస్రోతో పాటు, అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ ఏజెన్సీ (నాసా) 2021 డిసెంబర్ లో ఇమేజింగ్ ఎక్స్-రే పోలారిమెట్రీ ఎక్స్ ప్లోరర్ మిషన్ సూపర్ నోవా పేలుళ్ల అవశేషాలు, కృష్ణబిలాలు వెలువరించే కణ ప్రవాహాలు, ఇతర విశ్వ సంఘటనలపై ఇలాంటి అధ్యయనాన్ని నిర్వహించింది. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలపై దృష్టి సారించి భారతదేశంలో అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రాన్ని స్థాపించినప్పటికీ, సోమవారం మిషన్ శాస్త్రీయ సౌభ్రాతృత్వానికి ఒక ప్రధాన విలువను సూచిస్తుందని ఇస్రో పేర్కొంది.
ఈ మిషన్ జీవితకాలం సుమారు 5 సంవత్సరాలు ఉండనుంది. ఎక్స్ రే పోలరైజేషన్ పై అంతరిక్ష ఆధారిత అధ్యయనం అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటోందని, ఈ నేపథ్యంలో ఎక్స్ పోశాట్ మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఇస్రో తెలిపింది. కాగా.. ఎక్స్ పోశాట్ ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర సమాజానికి గణనీయమైన ప్రయోజనాలను తీసుకువస్తుందని భావిస్తున్నారు.