సారాంశం
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైంది. చంద్రుని దక్షిణ ధ్రువంలో ఈ మిషన్ లోని లాండర్, రోవర్లు విజయవంతంగా ల్యాండ్ అయ్యాయి. చంద్రయాన్ 3 మిషన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా ఈ మిషన్ లో భాగస్వామ్యమైన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ నివాసి, ఇస్రో శాస్త్రవేత్త అరీబ్ అహ్మద్ కుటుంబీకులు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం.
140 కోట్ల భారతీయుల ఆశలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ 3 మిషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువం పై చంద్రయాన్ 3 లోని లాండర్, రోవర్లు విజయవంతంగా ల్యాండ్ అయ్యాయి. అలాగే వాటికి నిర్దేశించిన పనులను నిర్విరామం లేకుండా చేస్తున్నాయి. ఈ విజయంతో భారత కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచ వ్యాప్తమయ్యాయి. దీంతో అటు ఇస్రో, ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన శాస్త్రవేత్తలకు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఏది ఏమైనా.. ఎవరెమన్నా.. ఈ ప్రయోగం విజయం వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల మేధస్సు, వారి కృషి ఉంది. వారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. వారి జీవితాలను మిషన్ కోసం ధారపోశారు. వారి గొప్పతనం గురించి ఎంత చెప్పిన చాలా తక్కువే..
ఇదిలా ఉంటే.. చంద్రయాన్ 3 మిషన్ ను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు బృందంలో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ నివాసి అరీబ్ అహ్మద్ కూడా భాగస్వామ్యం అయ్యారు. ఈ అద్బుత విజయం అనంతరం నుంచి అరీబ్ కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. అతన్ని చూడటానికి, అతడితో మాట్లాడడానికి స్థానికులు, తన బంధువులు చాలా ఆసక్తి చూపుతున్నారు. తన కుటుంబ సభ్యులను కూడా చాలా గౌరవిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇస్రో శాస్త్రవేత్త అరీబ్ అహ్మద్ ఇంటి వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది.
చంద్రయాన్ 3 సక్సెస్ అనంతరం ఇస్రో శాస్త్రవేత్త అరీబ్ ఇంటి వద్ద వందలాది మంది గుమ్మికూడారు. అతని బంధువులు, ఇరుగుపొరుగు వారు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఇస్రో శాస్త్రవేత్తను పొగడ్తలతో ముంచెత్తున్నారు. అరీబ్ కు చిన్ననాటి నుంచి తెలియని విషయాలను తెలుసుకోవాలనే అత్రుత, ఆసక్తి ఉండేదనీ, దేశం కోసం ఏదైనా చేయాలనే తపనతో ఉండేవాడని తన బంధువులు అంటున్నారు. చిన్నప్పుడే పలు బొమ్మ రాకెట్‌ను ఎలా తయారు చేశాడని వారు గుర్తు చేసుకున్నారు. భారతీయులందరికీ సమానావకాశాలు కల్పించబడుతున్నాయనడానికి అరీబ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు.
ఈ క్రమంలో అరీబ్ మేనమామ అసద్ ఫరోకీ మాట్లాడుతూ.. మిషన్ లాంచ్ కు ముందు అరీబ్ చాలా ఉద్విగ్నంగా ,చాలా ఆత్రుతగా ఉన్నాడు. అతను బయటి ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు అందులోనే నిమగ్నమయ్యాడు. అరీబ్ చిన్ననాటి నుంచి చాలా క్లెవర్. అరీబ్ పదో తరగతిలో టాపర్‌గా నిలిచాడు. అలాగే..12వ తరగతి పరీక్షల్లో 95 శాతం సాధించాడు. అనంతరం అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనే తన కలను సహకారం చేసుకోవడంలో భాగంగా జామియా మిలియా ఇస్లామియా చేరారు. అందులో నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందాడు. తర్వాత ఉన్నత చదువుల కోసం ఐఐటీ కాన్పూర్‌లో చేరారు. అతని లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా ఇస్రోలో ఉద్యోగం సాధించాలి. ఈ నేపథ్యంలో 2019 లో ఇస్రో నిర్వహించిన రిక్రూట్‌మెంట్ పరీక్షలో ప్రధమ స్థానం సాధించి, ఉద్యోగం సంపాదించాడు. మొదట్లో అతని ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌కి వెళ్లాలని కుటుంబం కోరుకున్నప్పటికీ.. అతని మాత్రం తన మనస్సు చెప్పినట్టు రాకెట్ సైన్స్‌లో చేరారు “ అని చెప్పుకొచ్చారు.
అనంతరం.. అరీబ్ తండ్రి ఖాజీ మెహతాబ్ జియా మీడియాతో మాట్లాడుతూ.. “సాధారణంగా తల్లిదండ్రులు సాధించిన విజయాల ద్వారా పిల్లలకు గుర్తింపు వస్తుంది. కానీ, నా కొడుకు సాధించిన ఘనతతో నాకు గుర్తింపు పొందుతున్న అదృష్టవంతుడ్ని నేను. ఏదో ఒక రోజు .. అరీబ్ కుటుంబాన్ని గర్వపడేలా చేస్తాడనే భావన నాకు ఉండేది. అదృష్టవశాత్తూ.. ఇస్రో విజయంలో నా కొడుకు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. యావత్ భారతం గర్వించేలా చేశాడు.ఇప్పుడు నా ప్రాంతంలో అందరూ నన్ను, నా కుటుంబాన్ని అభినందిస్తున్నారు. నాకు తెలియని వారు కూడా నన్ను గుర్తించి అరీబ్ తండ్రి కాదా? అంటూ అభినందిస్తున్నారు“ అని గర్వంగా చెప్పుకొచ్చారు.
అరీబ్ తల్లి నజ్నీన్ మాట్లాడుతూ.. “ అరీబ్ తమ కష్టాలను చూస్తూ..చదువుకున్నాడనీ, తన కొడుకుకు ప్రతి విషయాన్ని పట్టుదల చేస్తాడనీ, ఈ క్రమంలో అతని ఆరోగ్యం గురించి తాను ఆందోళన చెందేదానినని, ఈ తన కొడుకు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందనీ, నేడు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది.