ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2.23 గంటలకు నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీహరికోటలో సన్నాహాలు ఊపందుకున్నాయి.

దీనిలో భాగంగా శుక్రవారం రాకెట్ ప్రయోగ రిహార్సల్స్‌ను నిర్వహించనున్నారు. ఆదివారం మిషన్ రెడీనెస్ రివ్యూ, ల్యాబ్ సమావేశాలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 6.23 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి.. 20 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిస్తారు.

కౌంట్‌డౌన్ అనంతరం ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్లతో జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 జాబిలియాత్ర ప్రారంభంకానుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్-2 ప్రయోగం జరగాల్సి వుంది.

అయితే రాకెట్‌లోని క్రయోజనిక్ ఇంజన్‌లో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని ఇస్రో నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ లోపాన్ని సరిదిద్ది రాకెట్‌ను మరోసారి ప్రయోగానికి సిద్ధం చేశారు శాస్త్రవేత్తలు. ఈ ప్రక్రియలో విశ్రాంత శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు. ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో ఛైర్మ న్ డా.కె.శివన్ శనివారం షార్‌కు రానున్నారు.