ఇస్రో ప్రతి రోజూ 100కు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటోంది - చైర్మన్ ఎస్.సోమనాథ్
ఇస్రో ప్రతి రోజూ 100 సైబర్ దాడులకు గురవుతోందని ఆ సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. దానిని ఎదుర్కొనే పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ నెట్ వర్క్ ఇస్రో కు ఉందని చెప్పారు. పెరిగిన టెక్నాలజీతో, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో సైబర్ నేరగాళ్లు విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవచ్చని అన్నారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతి రోజూ 100కు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటోందని ఆ సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. కేరళలోని కొచ్చిలో రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సైబర్ కాన్ఫరెన్స్ సీ0సీ0ఎన్ 16వ ఎడిషన్ ముగింపు సమావేశానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. కేరళ పోలీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాఫ్ట్ వేర్, చిప్ ఆధారిత హార్డ్ వేర్ ను ఉపయోగించే రాకెట్ టెక్నాలజీలు సైబర్ దాడులకు అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు.
ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ నెట్ వర్క్ ఇస్రోకు ఉందని సోమనాథ్ స్పష్టం చేశారు. సాఫ్ట్ వేర్ తో పాటు రాకెట్ల లోపల హార్డ్ వేర్ చిప్ ల భద్రతపై దృష్టి సారించి ఇస్రో వివిధ పరీక్షలతో ముందుకు వెళ్తోందని అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అనేక ఉపగ్రహాలను సాఫ్ట్ వేర్ తో ఒకే సారి పర్యవేక్షించే పద్దతి వచ్చిందని అన్నారు. ఇది ఈ రంగం వృద్ధిని సూచిస్తుందని చెప్పారు. కొవిడ్ సమయంలో మారుమూల ప్రాంతం నుంచి ప్రయోగాలు జరపడం సాధ్యమైందని, ఇది టెక్నాలజీ విజయానికి నిదర్శనమని అన్నారు.
నావిగేషన్, మెయింటెనెన్స్ తదితరాల కోసం వివిధ రకాల ఉపగ్రహాలను రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. వీటితో పాటు సామాన్యుల దైనందిన జీవితానికి ఉపయోగపడే ఉపగ్రహాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇవన్నీ వివిధ రకాల సాఫ్ట్ వేర్ల ద్వారా కంట్రోల్ అవుతాయని చెప్పారు. వీటన్నింటినీ రక్షించడానికి సైబర్ భద్రత చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఒక వరమని, అదే సమయంలో అది ముప్పు అని సోమనాథ్ అన్నారు. అయితే అదే టెక్నాలజీతో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవచ్చని అన్నారు. ఆ దిశగా పరిశోధనలు, కృషి జరగాలన్నారు.
ఈ సమావేశానికి హాజరైన కేరళ రెవెన్యూ మంత్రి పి.రాజీవ్ మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ గవర్నెన్స్ లో రాష్ట్రం రోల్ మోడల్ అని అన్నారు. సైబర్ రంగానికి తగిన భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కల్పించగలదని తెలిపారు. సైబర్ రంగానికి తగిన భద్రత కల్పించే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. కేరళలో డిజిటల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ రంగానికి అవసరమైన తోడ్పాటును అందిస్తోందని తెలిపారు.