న్యూఢిల్లీ: సాధారణంగా ప్రజలు క్రికెటర్లో సినిమా సార్లో కనబడితే సెల్ఫీలకోసం ఎగబడడం మనం చూసే సర్వ సాధారణ విషయం. కానీ దానికి భిన్నంగా ఒక సైంటిస్టుకు ఇలాంటి అనుభవం ఎదురయ్యింది. 

ఆ సైంటిస్ట్ వేరెవరోకాదు ఇస్రో ఛైర్మన్ శివన్. విమానంలోకి అడుగు పెట్టగానే ప్రయాణీకులంతా అపూర్వ స్వాగతం పలికారు. కేరింతలతో చప్పట్లతో శివన్ కు స్వాగతం పలికారు. సెల్ఫీలకు ప్రయాణీకులంతా ఎగబడ్డారు. ఈ ఊహించని పరిణామానికి శివన్ ఉప్పొంగిపోయారు. 

ఈ దృశ్యాలనన్నింటిని ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది కూడా. ఇస్రో చైర్మన్ లాంటి వ్యక్తి ఇలా ఎకానమీ క్లాసులో ప్రయాణించడం ఆయన నిరాడంబరతకు చిహ్నమని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. 

సెల్ఫీలు అడిగిన అందరికి ఓపికగా సెల్ఫీలు ఇచ్చారు. ప్రయాణీకులతోపాటు సిబ్బంది కూడా ఫోటోలు దిగడానికి ఉత్సాహం కనబరిచారు. ఇలా ఓపిగ్గా  అణుకువతో తన నిరాడంబరతను శివన్ మరోమారు చాటుకున్నారు. 

వీడియోను చూసిన నెటిజన్లు శివన్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. సినిమాలకు క్రికెట్ కు సంబంధం లేని ఒక వ్యక్తిని ఇంతలా ప్రజలు గుర్తుపట్టి ఇంత ఆత్మీయతను చూపెట్టడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామమని అంటున్నారు. 

చంద్రయాణ్ 2 ల్యాండర్లో ఇబ్బందులు తలెత్తి కనెక్షన్ తెగిపోయినప్పుడు శివన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దృశ్యం చూసి యావత్ భారత దేశం కంటతడి పెట్టుకుంది. కన్నీరుకారుస్తున్న శివన్ ను గట్టిగా వాటేసుకొని మోడీ ఓదార్చారు.