భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్‌వీ సీ45 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలు నింగిలోకి దూసుకుపోనున్నాయి. శనివారం జరిగిన రాకెట్ సన్నద్ధత సమావేశంలో రిహార్సల్స్ పనితీరును విశ్లేషించి ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 6.27కి 27 గంటల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు.

సోమవారం ఉదయం 9.27 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ-45 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో డీఆర్‌డీవోకి చెందిన 436 కిలోల ఈఎంఐ శాట్‌‌తో పాటు అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన రెండు, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు ఇస్రో చైర్మన్ డాక్టర్. కె. శివన్ ఆదివారం ఉదయం షార్‌కు చేరుకోనున్నారు. ముందుగా ప్రయోగవేదిక వద్దకు వెళ్లి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. అనంతరం శాస్త్రవేత్తలతో సమావేశమై ప్రయోగంపై చర్చించనున్నారు.