సరికొత్త ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు ధీటుగా స్పెస్ పై పట్టు సాధిస్తున్న ఇస్రో మరో అద్భుత ఘట్టానికి రెడీ అవుతోంది. అంతరిక్షంలో పెద్దన్న పాత్ర వహిస్తున్న  ఐఎస్‌ఎస్‌ కి ఏ మాత్రం తీసిపోకుండా అంతరిక్ష కేంద్రానికి (స్పెస్ స్టేషన్) సిద్దమవుతోంది. గురువారం ఢిల్లీలో  నిర్వహించిన  మీడియా సమావేశంలో ఇస్రో చైర్మన్‌ డా.కె.శివన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు

భూమికి 400 కిలోమీటర్ల దూరంలో వ్యోమగాములు 15 నుంచి 20 రోజుల వరకు గడిపేలా ఉండేలా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అక్కడే ఉండి గురుత్వాకర్షణ తక్కువ ఉన్న ప్రదేశాల్లో మానవ శరీర పరిస్థితి గురించి తెలుసుకోవచ్చు అలాగే  మొక్కల పెరుగుదల, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? పదార్థాల భౌతిక ధర్మాలు వంటి అనేక సందేహాలపై పరిశోధనలు జరపవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భారత్ అంతరిక్ష కేంద్రం 20టన్నుల బరువుతో మాత్రమే రూపొందనుంది. అగ్ర రాజ్యాలు అమెరికా , రష్యా ఇతర దేశాలతో కలిసి ఏర్పాటు చేసిన ఐఎస్ఎస్ (అంతరిక్ష కేంద్రం)  మాత్రం 420టన్నుల బరువు కలిగి ఉంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉందని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2030 నాటికి భారతదేశానికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉంటుందని డా.శివన్‌ తెలిపారు

ఇక జూలై 15న చంద్రయాన్-2ను ప్రయోగించనున్నారు. 15 తెల్లవారుజామున 2.51 నిమిషాలకు జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా మీటరు పొడవైన 25 కేజీల బరువున్న రోవర్, ఆర్బిటర్, ల్యాండర్లను చంద్రుడిపైకి పంపున్నట్లు శివన్ ప్రకటించారు.