Israel-Iran War: ఇరాన్ ఆధీనంలో ఇజ్రాయెల్ నౌక.. భారతీయ మహిళకు విముక్తి..
Israel-Iran War: ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌కు సంబంధించిన కార్గో షిప్‌లో ఉన్న 17 మంది భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. బంధిత భారతీయుల్లో ఉన్న ఏకైక మహిళ గురువారం విడుదలైంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Israel-Iran War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోఇజ్రాయెల్‌కు సంబంధించిన కార్గో షిప్‌ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. అయితే ఆ షిప్ లో 17 మంది భారతీయులు బంధిలుగా మారారు. అందులో ఓ మహిళ కూడా ఉంది. కాగా.. బంధిత భారతీయుల్లో ఉన్న ఏకైక మహిళ ను విడుదల చేసింది ఇరాన్. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. కార్గో షిప్ ఎంఎస్‌సి ఏరీస్‌లో భారత సిబ్బందిలో భాగమైన కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ అనే మహిళా క్యాడెట్ కొచ్చిన్ చేరుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే.. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం మిగిలిన 16 మంది భారతీయ సిబ్బందితో టచ్‌లో ఉంటున్నట్టు తెలిపారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేశారు. "ఇరాన్ అధికారుల మద్దతు తో కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ భారతదేశానికి తిరిగి సురక్షితంగా చేరుకుంది. మిగిలిన 16 మంది భారతీయ సిబ్బంది శ్రేయస్సు కోసం ఎంబసీ ఇరాన్ వైపు టచ్‌లో ఉంది" అని ఆయన పేర్కొన్నారు. కొచ్చిన్ విమానాశ్రయంలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జోసెఫ్‌కు స్వాగతం పలికిన చిత్రాన్ని జైస్వాల్ పోస్ట్ చేశారు. MSC ఏరీస్‌లోని మిగిలిన సిబ్బంది శ్రేయస్సు కోసం టెహ్రాన్‌లోని భారత మిషన్ ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌కు చెందిన కార్గో షిప్‌లోని 17 మంది భారతీయుల్లో కేరళకు చెందిన మహిళ కూడా ఉండటం గమనార్హం.
ఏప్రిల్ 13న హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రత్యేక దళాల విభాగంచే స్వాధీనం చేసుకున్న భారతీయ కంటైనర్ షిప్ MSC ఏరీస్‌లోని 25 మంది సభ్యుల సిబ్బందిలో 17 మంది భారతీయులున్నారు. సముద్ర చట్టాలను ఉల్లంఘించినందుకు కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఈ విషయం తెలుసునని, మిగిలిన 16 మంది భారతీయ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వారంతా ఆరోగ్యంగా ఉన్నారు. భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏప్రిల్ 14న తన ఇరాన్ కౌంటర్ హోస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్‌తో ఫోన్ సంభాషించారు.ఈ సందర్భంగా భారత నావికుల విడుదల అంశాన్ని లేవనెత్తారు. జైశంకర్ సిబ్బంది గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ నుండి సహాయం అభ్యర్థించారు. దీని తరువాత ఇరాన్ మంత్రి అమీర్-అబ్దుల్లాహియాన్ ఆ సమయంలో భారతీయ సిబ్బందిని కలవడానికి భారత అధికారులను అనుమతిస్తామని చెప్పారు.