ఆవులను ఇస్కాన్ కసాయిలకు అమ్ముతోంది - బీజేపీ ఎంపీ మేనకాగాంధీ సంచలన ఆరోపణలు.. వీడియో వైరల్
ఇస్కాన్ సంస్థ గోశాలలు నిర్వహిస్తున్న పేరుతో ఆవులను కసాయిలకు విక్రయిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకగాంధీ సంచలన ఆరోపణలు చేశారు. వారు చేసినట్టుగా మరెవరూ చేయలేరని అన్నారు. అయితే దీనిపై ఇస్కాన్ స్పందించింది.
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ చైతన్యం (ఇస్కాన్) సంస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అది భారతదేశంలోనే అతి పెద్ద మోసపూరిత సంస్థ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ‘ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసపూరితమైన సంస్థ. అది గోశాలలను నిర్వహిస్తోంది. దీని వల్ల విస్తారమైన భూములతో సహా ప్రభుత్వం నుండి ప్రయోజనాలను పొందుతోంది’’ అని పేర్కొన్నారు.
‘టైమ్స్ నౌ’ ప్రకారం.. తాను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం గోశాలను సందర్శించానని మేనకా గాంధీ ఆ వీడియోలో తెలిపారు. అయితే అక్కడ పాలు ఇవ్వని ఆవు, దూడ కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మొత్తం డెయిరీలో ఎండిపోయిన ఆవు లేదు. ఒక్క దూడ కూడా అక్కడ లేదు. అంటే అన్నీ అమ్ముడుపోయాయని అర్థం’’ అని మేనకాగాంధీ వ్యాఖ్యానించారు.
‘‘ఇస్కాన్ తన ఆవులన్నింటినీ కసాయిలకు విక్రయిస్తోంది. రోడ్లపై 'హరే రామ్ హరే కృష్ణ' అంటూ పాటలు పాడుతుంటారు. తమ జీవితమంతా పాలపైనే ఆధారపడి ఉందని చెబుతుంటారు. బహుశా కసాయిలకు అమ్మినన్ని పశువులను బహుశా ఎవరూ అమ్మలేదు. ఇలా వారు చేసినట్టుగా మరెవరూ చేయరు.’’ అని మేనకా గాంధీ ఆరోపించారు.
కాగా.. మేనకా గాంధీ ఆరోపణలపై ఇస్కాన్ స్పందించింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గోసంరక్షణలో తమ సంస్థ అగ్రగామిగా ఉందని గుర్తు చేసింది. ఈ మేరకు ఆ సంస్థ భారతదేశ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. మేనకా గాంధీ ఆరోపణలన్నీ నిరాధారమైనవని అందులో తెలిపారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆవు, ఎద్దుల సంరక్షణలో ఇస్కాన్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. తమ సంస్థ ఆవులు, ఎద్దులను కసాయిదారులకు విక్రయించకుండా జీవితాంతం సేవ చేస్తోందని స్పష్టం చేశారు.
‘‘భారతదేశంలో ఇస్కాన్ 60కి పైగా గోశాలలను నడుపుతూ వందలాది పవిత్రమైన ఆవులు, ఎద్దులను సంరక్షిస్తూ, వాటి జీవితకాలమంతా వ్యక్తిగత సంరక్షణను అందిస్తోంది. ప్రస్తుతం ఇస్కాన్ గోశాలల్లో వదిలివేయబడిన ఆవులు, గాయపడిన, వధించకుండా కాపాడిన ఆవులను మా వద్దకు తీసుకొచ్చాం. వాటికి సేవలు అందిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.