దేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె, నీతా అంబానీల గారాలపట్టి ఈషా అంబానీ వివాహానికి సర్వం సిద్ధమైంది. అంబానీల ఇంట్లో పెళ్లంటే ఏ రేంజ్‌లో ఉంటుందోనని దేశ, విదేశాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నారు..

ఎవరెవరు వస్తున్నారు, వధూవరుల దుస్తుల ఖరీదు ఎంత లాంటి విషయాలపై సహాజంగానే ఆసక్తి ఉంటుంది.  ఇందుకు తగ్గట్టుగానే వెడ్డింగ్ కార్డ్ నుంచి పెళ్లికి భారీ ఏర్పాట్లు చేశాయి. అయితే ఇప్పుడీ వివాహానికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తన ముద్దుల కుమార్తె వివాహానికి ముఖేశ్ అంబానీల సుమారు 100 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.718 కోట్లు) ఖర్చు పెడుతున్నారన్నది ఆ వార్త సారాంశం. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఎంతోకొంత నిజం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవాళ ముంబైలోని ముఖేశ్ నివాసం యాంటీలియాలో ఈషా-ఆనంద్ పిరమల్‌తో వివాహాం జరగనుంది. ఇందుకోసం 27 అంతస్తుల ఈ భవంతిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివాహానికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా భద్రతా చర్యలను చేపట్టారు.

పెళ్లికి వచ్చే అతిథులు తమ వెంట ఫోన్లు తీసుకురావద్దని.. ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని వెడ్డింగ్‌ కార్డులోనే సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. పెళ్లి వేడుకలకు సంబంధించి వారం రోజుల ముందే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.

ఒకవేళ ఈషా పెళ్లికి ముఖేశ్ 700 కోట్లను ఖర్చు పెడితే మాత్రం.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లిలో ఈ పెళ్లి రెండో స్థానంలో నిలుస్తుంది. గతంలో 37 ఏళ్ల క్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్, డయానాల వివాహానికి 110 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.