తృణమూల్ కాంగ్రెస్‌లో వర్గపోరు తలెత్తినట్టుగా తెలుస్తున్నది. మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల మధ్య ఈ పోరు ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ రోజు హడావిడిగా సమావేశమైంది టీఎంసీ నేషనల్ వర్కింగ్ కమిటీని ప్రకటించడానికి కాదని, అంతకంటే ముఖ్యంగా పార్టీలో వర్గపోరు ముదిరి పార్టీ కార్యకలాపాలు చేజారి పోకుండా కాపాడటానికి జరిగిందనే చర్చ జరుగుతున్నది. ఈ సమావేశం తర్వాతే టీఎంసీ నేషనల్ వర్కింగ్ కమిటీని ప్రకటించింది. 

కోల్‌కతా: బీజేపీ(BJP)ని బలంగా ఢీకొట్టిన ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌(TMC)పై కమలం పార్టీ విమర్శకులకు ఎంతో ఆదరణ ఉంటుంది. మోడీ ప్రభుత్వానికి, బీజేపీ నేతలకు దీదీ విసరే సవాళ్లపై వారికి ఎంతో ఆసక్తి ఉంటుంది. కేంద్రంలో అధికారాన్ని రెండోసారి కైవసం చేసుకుని బలమైన పార్టీగా ఎదిగిన బీజేపీని విజయవంతంగా ఢీకొని గెలిచిన ప్రాంతీయ పార్టీ టీఎంసీ మరెంతో పటిష్టంగా ఉన్నదనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నవే. కానీ, తాజా పరిణామాలు ఈ అభిప్రాయాల్లో నిజం లేదన్నట్టుగా ఉన్నాయి. మమతా బెనర్జీ(Mamata Banerjee), ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) మధ్యనే వర్గపోరు తలెత్తిందా? అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు.

టీఎంసీ చీఫ్ ఇప్పుడు మమతా బెనర్జీ. ప్రస్తుతానికి ఆమె తర్వాత పార్టీలో నెంబర్ 2... అభిషేక్ బెనర్జీనే. అయితే, అభిషేక్ బెనర్జీ పట్టుపడుతున్న ఓ ప్రతిపాదన పార్టీలోని సీనియర్లు కలవరపెడుతున్నది. ‘వన్ మ్యాన్ వన్ పోస్టు’ అనే పాలసీని కచ్చితంగా అమలు చేసి తీరాలనేది అభిషేక్ బెనర్జీ వాదన. కొంతకాలంగా దీన్ని బలంగా వాదిస్తున్నారు. కానీ, పార్టీలో ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కలిగి ఉన్న సీనియర్ నేతలకు ఈ ప్రతిపాదన మింగుడుపడటం లేదు.

ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీఎంసీలోనే అభ్యర్థుల రెండు జాబితాలు రావడం చర్చనీయాంశం అయింది. అభిషేక్ బెనర్జీ యువ రక్తం డిమాండ్లను బలంగా వాదిస్తుండగా.. ఈ తరుణంలోనే మమతా బెనర్జీ సీనియర్ల వైపు మొగ్గారు. ఇలాంటి వర్గపోరులను పరిష్కరించడానికి లేదా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి మమతా బెనర్జీ ఓ చిన్న కమిటీ వేసింది. ఈ కమిటీతో మమతా బెనర్జీ సమావేశం అయ్యారు. ఆ తర్వాతే ఆమె పార్టీ అత్యున్నత కమిటీలో ఉండబోయే వారి పేర్లను ప్రకటించారు. 20 సభ్యులతో కూడిన జాతీయ వర్కింగ్ కమిటీని దీదీ వెల్లడించారు.

ఇందులో అమిత్ మిత్ర, పార్థ చటర్జీ, సుబ్రతా బక్షి, సుదీప్ బంధోపాధ్యాయ్, అనుబ్రతా మొండల్, అరూప్ బిశ్వాస్ మొదలైనవారితోపాటు అభిషేక్ బెనర్జీ పేరు కూడా ఉన్నది. అభిషేక్ బెనర్జీనే బహుశా నేషనల్ జనరల్ సెక్రెటరీగా కొనసాగుతారని భోగట్టా.

టీఎంసీ నేషనల్ వర్కింగ్ కమిటీని ప్రకటించడానికి ఈ రోజు దీదీ సమావేశం అయిందనే వార్తలు ఉన్నా.. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల మధ్య వర్గపోరు ముదరకుండా చర్యలు తీసుకోవడానికి భేటీ జరిగిందనేది అనఫిషియల్ టాక్.

పార్టీలో వర్గపోరును ధ్రువపరిచే ఓ ఘటన ఇటీవలే చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్‌వాదీ తరఫున ప్రచారం చేయడానికి మమతా బెనర్జీ ఇటీవలే ఆ రాష్ట్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. యూపీ పర్యటనకు ముందు విలేకరుల ప్రశ్నకు ఆమె సమాధానం కొంత ఆలోచనార్హంగా ఉన్నది. మమతా బెనర్జీ ఇప్పుడు క్యాంపెయినింగ్ కోసం గోవా వెళ్తున్నారా? అని విలేకరుల ప్రశ్నించగా.. ‘అక్కడ ఒకరు ప్రచారం చేస్తున్నారుగా.. నేను చేయడం లేదు. నేను వేరే ప్రాంతానికి వెళ్తున్నా.. విస్తృత ప్రయోజనాలను కాంక్షిస్తూ అక్కడకు వెళ్తున్నాను’ అని సమాధానం చెప్పారు.

ఇక్కడ ‘ఒకరు’ అని అభిషేక్ బెనర్జీని ఆమె సంబోధించారు. ఎందుకంటే గోవాలో టీఎంసీ క్యాంపెయినింగ్‌ను అభిషేక్ బెనర్జీనే చేపడుతున్నారు.