కర్ణాటకలో మరో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే హిజాబ్ వివాదంతో రాష్ట్రమంతా వేడుక్కుతుండగా.. భజరంగ్ దళ్ సభ్యుడు 26 ఏళ్ల హర్ష హత్య నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ హత్యకు హిజాబ్ వివాదంతో సంబంధం ఉన్నదా? అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తున్నది. 

బెంగళూరు: కొన్ని నెలలుగా కర్ణాటక(Karnataka)లోని హిజాబ్ వివాదం(Hijab row) రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నది. ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకూ ఈ వ్యవహారం వెళ్లింది. తాజాగా, కర్ణాటకలో మరో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. హిజాబ్ వివాదం కొనసాగుతున్న తరుణంలో కమలం గూటికి చెందిన భజరంగ్ దళ్(Bajarang Dal) సంస్థ సభ్యుడు ఒకరి హత్య(Murder) జరిగింది. ఈ హత్య మరోసారి రాష్ట్రంలో కలకలం రేపింది. కాషాయ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. కొన్ని చోట్ల కొందరు దుండగులు వాహనాలకు నిప్పు పెట్టారు. రాళ్లు విసిరేసిన ఘటనలూ చోటుచేసుకున్నాయి.

నిన్న రాత్రి భజరంగ్ దళ్ కార్యకర్త 26 ఏళ్ల హర్ష(Harsha)ను కొందరు దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. శివమొగ్గ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యకర్త హత్య ఘటనకు సంబంధించి కర్ణాటక పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. హర్ష హత్యతో జిల్లా మొత్తం అగ్నిగుండంలా మారింది. నిరసనలు, ఆందోళనలతో మారుమోగిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, హర్ష హత్యకు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న హిజాబ్ వివాదానికి ఏమైనా సంబంధం ఉన్నదా? అనే చర్చ జరుగుతున్నది. దీనిపై రాష్ట్ర మంత్రులు, పోలీసులూ స్పందించారు.

హర్ష హత్యకు హిజాబ్ వివాదానికి మధ్య సంబంధం ఉన్నదా? అనే విషయంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు వెల్లడైంది. రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప.. ఈ హత్యపై స్పందిస్తూ హిజాబ్‌ వివాదంతో సంబంధం ఉన్నదన్నట్టుగానే మాట్లాడారు. కొందరు ముస్లిం రౌడీలు హర్షను హత్య చేశారని పేర్కొన్నారు. శివమొగ్గలోని ఓ కాలేజీలో జాతీయ జెండా స్థానంలో కాషాయ జెండాను ఎగరేశారని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రెచ్చగొట్టారని అన్నారు. ఆయన రెచ్చగొట్టడం కారణంగా కొందరు హర్షను హత్య చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు కొట్టి పారేశారు.

ఇదిలా ఉండగా, రాష్ట్ర హోం మంత్రి జ్ఞానేంద్ర ఈ ఘటనపై మాట్లాడుతూ.. హర్ష హత్యకు.. రాష్ట్రంలో రగులుతున్న హిజాబ్ వివాదానికి సంబంధం లేదని కొట్టిపారేశారు. శివమొగ్గ చాలా సున్నితమైన నగరం అని వివరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని హోం మంత్రి కార్యాలయం తెలిపింది. 

హోం మంత్రి జ్ఞానేంద్ర హర్ష కుటుంబ సభ్యులను హాస్పిటల్‌లో ఈ రోజు ఉదయం కలిశారు. వారిని ఓదార్చారు. హర్ష కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. హర్ష హత్యలో నలుగురైదుగురు నిందితుల హస్తం ఉండచ్చని తెలిపారు. పోలీసులకు ఈ హత్య గురించి కొన్ని క్లూలు దొరికాయని, త్వరలోనే హర్ష హత్యకు సంబంధించిన కారణాలను వెలుగుచూడవచ్చని వివరించారు. హర్ష హత్య వెనుక ఏదైనా సంస్థ ఉన్నదా? అనే విషయంపై ఇంకా ఆధారాలు అయితే లేవని చెప్పారు. ఘటన తర్వాత సరిపడా సెక్యూరిటీ అరేంజ్ చేశామని, గత రాత్రి కొన్ని ఆందోళనలు జరిగినా.. ఇప్పుడు పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.

హిజాబ్ వివాదంతో హర్ష హత్యకు సంబంధం ఉన్నదనే వాదనలను కర్ణాటక పోలీసు అధికారి ఒకరు కొట్టి పారేశారు. శివమొగ్గ జిల్లాలోని దొడ్డపేటలో ఈ ఘటనపై కేసు నమోదైందని వివరించారు. ఈ ఘటనలో తమకు కొన్ని క్లూలు లభించాయని పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. దీనికి హిజాబ్ వివాదంతో సంబంధమే లేదని అన్నారు. హర్షకు ఆ గ్యాంగ్‌తో ఇది వరకే పరిచయాలు ఉన్నాయని వివరించారు. బహుశా వారి మధ్య పాత కక్ష్యల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. గత రాత్రి 9 గంటల ప్రాంతంలో హర్షపై దాడి జరిగి ఉండొచ్చని చెప్పారు. ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించినా.. ప్రాణాలు దక్కలేవని వివరించారు.