ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముహుర్తం ఖరారైన నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహ ప్రతి వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. బీజేపీ శివసేనలు పొత్తుకు అంగీకరించినప్పటికీ, ఉన్న 288 సీట్లలో ఖచ్చితంగా సగం సీట్లను తమకు ఇవ్వవలిసిందేనని శివసేన పట్టుబడుతోంది. 

అందుతున్న సమాచారం మేరకు బీజేపీ 117 సీట్లను శివసేనకు ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ 50శాతం సీట్లు ఇవ్వవలిసిందేనని శివసేన మొండికేస్తుంది. బీజేపీ అన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. కొన్ని రోజులుగా సాగుతున్న ఈ గిల్లికజ్జాలు ఇప్పుడు ముదిరి పాకాన పడ్డట్టు అనిపిస్తున్నాయి. 

నేడు జరిగిన కార్యకర్తల సమావేశంలో శివ సైనికుడిని మహారాష్ట్ర కు ముఖ్యమంత్రిని చేస్తానని తన తండ్రి బాల్ ఠాక్రే కు మాట ఇచ్చానని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఈ సభకు 288 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. అందరూ పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

బీజేపీతోని సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయని అన్నారు. చర్చలు సఫలమైతే, బీజేపీ పోటీ చేసే అన్ని చోట్లా శివసైనికులు సహకారం అందించాలని, శివసైనికులకు కూడా బీజేపీ కార్యకర్తల సహకారం ఉంటుందని అన్నారు. 

మొత్తంగా చూస్తే 125 సీట్లు, ఉప ముఖ్యమంత్రి పదవిని శివసేనకు బీజేపీ ఇవ్వనున్నట్టుగా తెలియవస్తుంది. గత పర్యాయం శివసేన, బీజేపీలు వేర్వేరుగా పోటీ చేశాయని, ఈ పర్యాయం కూడా పొత్తు కుదరకపోతే తాము ఒంటరిగా పోరుకు సిద్ధమేనని కొందరు శివసేన నేతలు అంటున్నారు.