మోడీషాలకు అద్వానీ విలువ తెలిసిందా.. లేక..?

Is Modi aware of the value of Advani or
Highlights

మోడీషాలకు అద్వానీ విలువ తెలిసిందా.. లేక..?

ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు స్వయంగా బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని కలిశారంటూ ఓ జాతీయ మీడియా ఛానెల్, వెబ్‌సైట్‌లో కథనాలు రావడం దేశ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతోంది. దేశం మొత్తాన్ని కాషాయమయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న మోడీ, అమిత్ షాలు ఆ ప్రణాళికలో భాగంగా ఒక్కో రాష్ట్రంలో బీజేపీ జెండా పాతుతూ వెళ్తున్నారు.

అయితే అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని.. నైతిక విలువలు పాటించడం లేదంటూ దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా జరిపిన సర్వేలో మోడీ గ్రాఫ్ దారుణంగా పడిపోవడం బీజేపీలో అంతర్మథనానికి కారణమవ్వడంతో పాటు పార్టీలో మోడీపై ఉన్న అసమ్మతిని కొందరు బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీషాలు ఆలోచనలో పడ్డారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పార్టీపై పట్టు తప్పే ప్రమాదముందని గ్రహించి పక్కనబెట్టిన సీనియర్లను తిరిగి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దానిలో భాగంగానే అద్వానీని కలిశారని.. 2019లోనూ తిరిగి లోక్‌సభ‌కు పోటీ చేయాలని కోరినట్లు పొలిటికల్ టాక్. అయితే గతం మాదిరిగా ఈసారి అద్వానీ.. మోడీని నమ్మే పరిస్థితి లేదన్నది సుష్పష్టం. 2014లో తనను పక్కనబెట్టి 1987లో తన హయాంలో ఒక సాధారణ కార్యకర్తలా బీజేపీలో ప్రవేశించిన మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినా అద్వానీ దిగమింగుకున్నారు. 70 ఏళ్లు పైబడిన వారు పార్టీ పదవులకు, ఎన్నికలకు దూరంగా ఉండాలని శాసనం చేసినా లాల్ కిషన్ మౌనంగానే ఉంటూ.. తన అస్త్ర సన్యాసానికి సమయం దగ్గరపడిందని భావించారు. కానీ దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుండటంతో..తనను ఆదుకోవాలని కాకా పట్టేందుకు వచ్చిన శిష్యుడిని క్షమిస్తారా..? లేదంటే పార్టీ ప్రయోజనాల కోసం రాజీపడతారా అన్నది తేలాలంటే కొద్దిరోజులు ఎదురుచూడక తప్పదు. 

loader