Devendra Fadnavis: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామా చేయాలనే డిమాండ్ చేశారు బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్. ఈ క్రమంలో నిరసనలు వ్యక్తం చేయడంతో దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఇతర బీజేపీ నేతలను బుధవారం ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దావూద్ ఇబ్రహీం కు మహా సర్కార్ మద్దతుందా ? అని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నించారు.
Devendra Fadnavis: మనీల్యాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటున్న ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామా చేయాలని బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మనీల్యాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ను పదవీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అతనిని ఇప్పటి వరకూ బర్త్ రఫ్ చేయకపోవడం వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు మహా రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉందా ? అని ప్రశ్నించారు ఫడ్నవీస్. మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
జైలులో ఉన్న వ్యక్తి.. ఇప్పటి వరకూ మంత్రిగా పదవిలో ఉన్నారనీ, ఇది సరైన పద్దతి కాదనీ, ఆయనను వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని అసెంబ్లీ స్పీకర్‌ను అభ్యర్థించినట్టు ప్రతిపక్ష నాయకుడు ఫడ్నవిస్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సెషన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో మాలిక్‌ను తొలగించాలని ఒత్తిడి చేశారు ఫడ్నవీస్. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన కొనసాగించడంతో సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ క్రమంలో ఫడ్నవీస్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా వారిని పోలీసులు నిర్భందించి ఆ తర్వాత కొద్దిసేపటికి విడుదల చేశారు.
దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ప్రత్యేక PMLA కోర్టు మార్చి 21 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన తర్వాత మిస్టర్ మాలిక్ సోమవారం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసు విషయంలో ఇటీవల ముంబైలోని దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.. ముంబైలోని అండర్ వరల్డ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులతో సంబంధం ఉన్న పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
బీజేపీ నేతలపై కుట్రకు సంబంధించిన పెన్ డ్రైవన్‌ను ఫడ్నవీస్ అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించిన కొద్దిగంటలకే ఈ ఘటన జరిగింది. అయితే శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపితో కూడిన మహా వికాస్ అగాధి (ఎంవి) డిమాండ్‌ను తిరస్కరించింది. రాష్ట్రంలో బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఎంవీఏ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఫడ్నవీస్ ఆరోపిస్తున్నారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఫడ్నవీస్ ఆరోపణలకు ఆధారంగా ఇచ్చిన వీడియో కచ్చితత్వాన్ని నిర్ధారించాల్సి ఉందని పవార్ పేర్కొన్నారు.
