ముంబై నుంచి సికింద్రాబాద్ బయల్దేరిన దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పట్టాలపై ఏదో వస్తువు వున్నట్లు గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేక్ ద్వారా రైలును నిలిపివేశారు.

హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంఘటనతో దేశం మరోసారి ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు దగ్గమయ్యాయి. ప్రయాణీకులు, అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలావుండగా మహారాష్ట్రలో మరో రైలు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్మును వుంచారు. దీనిని గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. 

ALso Read: రైలు ప్రమాదంపై తెలంగాణ డీజీపీ ట్వీట్.. ‘అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు’

వివరాల్లోకి వెళితే.. ముంబై నుంచి సికింద్రాబాద్ బయల్దేరిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం తెల్లవారుజామున మహారాష్ట్రంలోని జల్నా జిల్లా సతోనా-ఉస్మాన్‌పూర్ మీదుగా వెళ్తోంది. అయితే ఆ సమయంలో పట్టాలపై ఏదో వస్తువు వున్నట్లు గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేక్ ద్వారా రైలును నిలిపివేశారు. అనంతరం కిందకి దిగి చూడగా.. ట్రాక్ మధ్యలో రాళ్లతో నిండిన డ్రమ్ము కనిపించింది. దీనిపై లోకో పైలట్ ఆర్పీఎఫ్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని డ్రమ్మును తొలగించారు. అనంతరం రైలు సికింద్రాబాద్‌కు బయల్దేరింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.