కర్ణాటక‌లో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న ఘర్షణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులో ఒకరు ఐపీఎస్ అధికారిణి డి రూపా మౌద్గిల్, మరొకరు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి.

కర్ణాటక‌లో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న ఘర్షణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులో ఒకరు ఐపీఎస్ అధికారిణి డి రూపా మౌద్గిల్, మరొకరు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి. వీరిద్దరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు పలు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇరువురి మధ్య అసలు వివాదమేమిటి..? ఒకరిపై ఒకరు ఎందుకు విమర్శలు చేసుకుంటున్నారో తెలసుకుందాం. ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు రూప కర్ణాటక హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌లో ఐజీపీ, ఎండీగా పని చేస్తున్నారు. 

అయితే రోహిణి సింధూరి, మైసూరులోని కృష్ణరాజనగర నుంచి జేడీ(ఎస్) ఎమ్మెల్యే సారా మహేష్ రెస్టారెంట్‌లో కలిసి కూర్చున్న ఫోటోలు వెలువడిన తర్వాత ఇది ప్రారంభమైంది. 2021లో రోహిణిని మైసూరు డిప్యూటీ కమీషనర్‌గా నియమించిన సమయంలో ఆమెకు, ఎమ్మెల్యేకు మధ్య అనేక గొడవలు జరిగాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఫోటోలు వెలువడిన తర్వాత రూప.. ఒక అధికారి రాజకీయ నాయకుడిని ఎందుకు కలుస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. రాజీ కుదుర్చుకుంటున్నారా? అని కూడా అడిగారు. అయితే దీనిపై స్పందించిన రోహిణి.. ఇది తప్పుడు, వ్యక్తిగత దూషణల ప్రచారమని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇరువురు మహిళా అధికారుల మధ్య పూర్తిస్థాయి వాగ్వాదం మొదలైంది. 

ఇక, రూప ఫేస్‌బుక్ పోస్టులో రోహిణిపై పలు ఆరోపణలు చేశారు. రోహిణి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రోహిణి ఆమె ప్రైవేట్ ఫోటోలను మగ ఐఏఎస్ అధికారులకు పంపడం ద్వారా సర్వీస్ కండక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. కొన్ని ఫొటోలను కూడా రూప ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వాటని 2021,2022లో ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పంచుకున్నారని ఆరోపించారు. గతంలో రోహిణి అప్పటి మైసూరు సిటీ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్‌తో సహా కొందరు తోటి సివిల్ సర్వెంట్‌లతో రోహిణికి వైరుధ్యాలు ఉన్నాయని కూడా ప్రస్తావించారు. 

‘‘ఆమె నా సోషల్ మీడియా నుంచి ఫోటోలు, నా వాట్సాప్ స్టేటస్ యొక్క స్క్రీన్‌షాట్‌లను నా పరువు తీసేందుకు సేకరించింది. నేను ఈ చిత్రాలను కొంతమంది అధికారులకు పంపినట్లు ఆమె ఆరోపించినందున.. వారి పేర్లను బహిర్గతం చేయాలని నేను ఆమెను కోరుతున్నాను’’ అని సింధూరి చెప్పారు. మానసిక అనారోగ్యం చాలా పెద్ద సమస్య అని.. దీనిని మందులు, కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసినప్పుడు మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. రూప తనపై తప్పుడు, వ్యక్తిగత దుష్ప్రచారాలను నడుపుతోందని మండిపడ్డారు. 

ప్రభుత్వం సీరియస్.. 
అయితే ఇరువురు ఉన్నతాధికారుల మధ్య బహిరంగ పోరు రోజురోజుకు తారాస్థాయికి చేరడంతో.. ప్రభుత్వం స్పందించింది. మహిళా అధికారుల బహిరంగ వివాదంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. అధికారులు అలా ప్రవర్తించడం పెద్ద నేరం అని పేర్కొన్నారు. ప్రైవేట్ విషయాలను పబ్లిక్ డొమైన్‌లోకి లాగుతున్నారని.. మీడియా ముందు వారి చర్యలు కూడా సరికాదని అన్నారు. ఇద్దరు అధికారుల తీరు చూసి ప్రజలు షాక్ తింటున్నారని తెలిపారు. వీరి ప్రవర్తన వల్ల మంచి అధికారులకు అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, డీజీతో మాట్లాడానని.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.