నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం ఇవ్వాలంటూ ఓ మహిళ రక్తంతో లేఖ రాసింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సదరు మహిళ రక్తంతో లేఖ రాయడంతోపాటు... ఆ లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే....  సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం డిసెంబర్ నెలలో నిర్భయ అనే యువతిపై కదిలే బస్సులోనే ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి నడి రోడ్డుపై పడేశారు. వారి దాడిలో నిర్భయ దాదాపు 13 రోజులపాటు ప్రాణాలతో పోరాడి ఆ తర్వాత తుదిశ్వాస విడిచింది.

ఈ ఘటనలో ఆరుగురు నిందితుల్లో ఒకరు మైనర్ కాగా... మరొకరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మిగిలిన నలుగురు నిందితులకు త్వరలోనే ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో... ఢిల్లీకి  చెందిన మహిళా షూటర్ వర్టికాసింగ్ రక్తపు లేఖ కలకలం రేపుతోంది.

ఆ నలుగురు దోషులను ఉరితీసే అవకాశం ఇవ్వాలంటూ రక్తంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాసింది. మన దేశంలో మహిళలను అపరకాళిగా భావిస్తారని, నిందితులను ఉరితీసే అవకాశం తనకిస్తే ఆ భావన మరింత బలపడుతుందని, ప్రపంచానికీ అవగతం అవుతుందని పేర్కొన్నారు. మహిళలపై ఘోరాలకు పాల్పడితే తమను ఓ మహిళే ఉరికొయ్యకు వేలాడదీస్తుందన్న సంగతి రేపిస్టులకు తెలియాలన్నారు. 

ఈ విషయంలో తనకు మహిళా సైనికులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సంస్థలు మద్దతు పలకాలని కోరారు. కాగా నిర్భయ నిందితులను ఉరితీసేందుకు అవకాశమివ్వాలంటూ చాలామంది లేఖలు రాస్తున్నారని ఢిల్లీ తిహాడ్‌ జైలు అధికారులు పేర్కొన్నారు. 

పిస్టులను నేరం చేసిన ఆరునెలల్లోగా ఉరితీయాలనే డిమాండ్‌తో పదిరోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలీవాల్‌ ఆరోగ్యం విషమించింది. ఆదివారం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీవార్డులో ఆమెకు ఫ్లూయిడ్స్‌ ఎక్కిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.