జేఎన్‌యూ విద్యార్థి, కాంగ్రెస్ లీడర్ కన్హయ్య కుమార్‌పై లక్నోలో ఓ దుండగుడు ఇంక్ విసిరాడు. అది ఇంక్ కాదని, ఒక రకమైన యాసిడ్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నోలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయడానికి కన్హయ్య కుమార్ అక్కడికి వెళ్లారు. ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుండగా ఓ దుండుగు ఆయనపై ఇంక్ విసిరాడు. కానీ, ఆ ఇంక్ ఆయనపై పడలేదు. ఆయన చుట్టూ ఉన్న ఇతర యువకులపై పడింది. 

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నేత, కాంగ్రెస్ యంగ్ లీడర్ కన్హయ్య కుమార్‌పై ఉత్తరప్రదేశ్‌లో దాడి జరిగింది. లక్నోలో ఆయన ప్రచారం చేస్తుండగా ఆయనపై ఇంక్ విసిరారు. అయితే, అది ఇంక్ కాదని, ఒక రకమైన యాసిడ్ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ యాసిడ్ విసిరిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, ఇంక్ విసిరిన వారిని పార్టీ కార్యకర్తలు పట్టుకున్నట్టు సమాచారం.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న తరుణంలో కన్హయ్య కుమార్ లక్నోకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. లక్నోలో ప్రచారం చేస్తుండగానే ఆయనపై ఈ దాడికి కుట్ర జరిగినట్టు తెలిసింది. ఓ దుండగుడు కన్హయ్య కుమార్‌పై ఈ లిక్విడ్‌ను విసిరాడు. అయితే, ఆ ద్రవం కన్హయ్య కుమార్‌పై పడలేదు. ఆయన పక్కనే నిలబడిన ముగ్గురు నలుగురు యువకులపై పడిందని కాంగ్రెస్ నేతలు చెప్పారు. వెంటనే పార్టీ కార్యకర్తలు ఆ నిందితుడిని పట్టుకున్నారు. కానీ, ఆ నిందితుడి వివరాలేవీ వెల్లడించలేదు. లక్నోలో కాంగ్రెస్ అభ్యర్థల కోసం కన్హయ్య కుమార్ డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు.

ప్రియాంక గాంధీ సారథ్యంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని కన్హయ్య కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్, లఖింపూర్ ఖేరి, ఉన్నావ్ ఘటనలు జరిగినప్పటి నుంచి వీధుల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయాన్ని కోరుతున్నదని తెలిపారు. కొందరు దేశాన్ని నిర్మించడమే చేతకాని వారు.. ఇప్పుడు దేశాన్ని అమ్మేస్తున్నారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు సంధించారు. ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తుల నుంచి దేశాన్ని కాపాడటానికి కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు.

గతంలోనూ కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీలపై ఇంక్ విసిరిన ఘటనలు ఉన్నాయి. 2018లో గ్వాలియర్‌లో వీరిపై హిందూ సేనకు చెందిన ముకేశ్ పాల్ ఇంక్ విసిరాడు. కన్హయ్య కుమార్ , జిగ్నేశ్ మేవానీలు గ్వాలియర్‌లో నిర్వహించిన సంవిధాన్ బచావో కార్యక్రమంలో మాట్లాడటానికి వెళ్లిన సందర్భంలో 2018లో ఈ ఘటన జరిగింది. వారు ఉపన్యసించడానికి కొన్ని నిమిషాల ముందే ఆ నిందితుడు వారిపై ఇంక్ విసిరాడని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

కాగా, నోయిడాలో ఎన్నిక‌ల ఇంటింటి ప్ర‌చారంలో ఇటీవలే పాల్గొన్న కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) .. తాము అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌నీ, వివిధ ఉద్యోగాల కోసం ప్ర‌త్యేకంగా జాబ్ క్యాలెండ‌ర్ (job calendar) ను తీసుకువ‌స్తామ‌ని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నోయిడాలోని వివిధ బృందాలతో ఆమె మాట్లాడారు. ఇంటింటి ప్ర‌చారం కొన‌సాగించారు. జాబ్ క్యాలెండ‌ర్ కు సంబంధించిన అన్ని వివ‌రాలు ముందుగానే వెల్ల‌డిస్తామ‌నీ, ఉద్యోగాలు ఎలా కల్పిస్తామో అన్నది కూడా యువతకు చెబుతామని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పేర్కొన్నారు. ఎన్నిక‌ల (UP Assembly Election) ప్ర‌చారంలో భాగంగా ఇత‌ర పార్టీల‌పై విమ‌ర్శ‌లు సైతం గుప్పించారు.