భారత దేశ ఉత్తర సెక్టార్లో చైనా ఉనికి పెరిగిందని, వారు వివిధ ప్రాంతాలకు త్వరగా చేరుకోగలుగుతున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ చైనా సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయలను వేగంగా నిర్మించాలని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ను ఆయన కోరారు. 

న్యూఢిల్లీ : పర్వత ప్రాంతాల్లో, చైనా స‌రిహ‌ద్దు స‌మీపంలో మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయాల‌ని, దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని త‌న సామార్థ్యాన్ని పెంచుకోవాల‌ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO))ను కోరారు.

‘‘ ఇటీవలి కాలంలో ఉత్తర సెక్టార్లో చైనా ఉనికి పెరిగింది. వారు వివిధ ప్రదేశాలకు త్వరగా చేరుకోగలిగారు. BRO సమాంతరంగా పనిచేయడం కొనసాగించాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకొని తన సామర్థ్యాన్నిపెంచుకోవడంపై దృష్టి పెట్టాలి’’ అని శనివారం నాడు 63 వ రైజింగ్ డే కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ ప్రసంగిస్తూ అన్నారు. ఆ దిశలో బీఆర్ వో కు అవసరమైన మద్దతును అందించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. 

2022-23 ఆర్థిక సంవత్సరంలో BRO మూల‌ధ‌న బడ్జెట్ ను 3,500 కోట్ల (40 శాతం పెంపుద‌ల‌) రూపాయలకు పెంచుతున్నట్లు ఇటీవల చేసిన ప్రకటనపై కూడా ర‌క్ష‌ణ శాఖ మంత్రి మాట్లాడారు. దేశ భద్రత, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని ప్రభుత్వ సమగ్ర రక్షణ వ్యూహంలో ప్రధాన భాగంగా అభివర్ణిస్తూ ఇది దేశంలోని భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తుందని ఆయ‌న అన్నారు. 

ఒక ప్రాజెక్టును చేపట్టే ప్రాంతాల్లోనే కాకుండా, దేశం మొత్తానికి భద్రత, శ్రేయస్సు కొత్త తలుపులు తెరిచినందుకు మంత్రి BRO సంస్థను ప్రశంసించారు. ఒక దేశ పురోగతిలో రోడ్లు, వంతెనలు, సొరంగాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన రాజ్ నాథ్ సింగ్, బీఆర్ఓ పూర్తి చేసిన ప్రాజెక్టులు సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను మెరుగుపరిచాయని, సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల సామాజిక- ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచాయని అన్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ప్రధాని నరేంద్ర మోదీ ఊహించిన విధంగా బలమైన, సురక్షితమైన, స్వావలంబన కలిగిన 'న్యూ ఇండియా'ను నిర్మించడానికి ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతకు సూచిక అని ఆయన అన్నారు. సరిహద్దు ప్రాంతాలు కొత్త అభివృద్ధి కేంద్రాలుగా ఆవిర్భవించాయని, ఈశాన్య ప్రాంతం వంటి ప్రాంతాలు తమను తాము అభివృద్ధి చేసుకోవడమే కాకుండా దేశ సర్వతోముఖ ప్రగతికి ముఖద్వారంగా మారాయని రక్షణ మంత్రి నొక్కిచెప్పారు. ఈశాన్య ప్రాంతం భారత దేశాన్ని దక్షిణాసియా, ఆగ్నేయాసియాతో అనుసంధానం చేస్తున్నందున అంతర్జాతీయ స్థాయిలో దేశ పురోగతి కోసం ఈ ప్రాంతాల అభివృద్ధి ఎంతో ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. 

1960లో కేవలం రెండు ప్రాజెక్టులతో తూర్పులో ప్రాజెక్ట్ టస్కర్, ఉత్తరాన ప్రాజెక్ట్ బీకాన్ చేప‌ట్టిన బీఆర్ఓ నేడు వివిధ రాష్ట్రాల్లో 18 ప్రాజెక్టులతో ఒక శక్తివంతమైన సంస్థగా మారింది. ఇది భారతదేశ సరిహద్దుల వెంబడి ప్రతికూల వాతావరణ, భౌగోళిక పరిస్థితులలో 60,000 కిలోమీటర్లకు పైగా రహదారులు, 840 వంతెనలు, నాలుగు సొరంగాలు, 19 వైమానిక స్థావరాలను నిర్మించింది. ఇవి వ‌ల్ల దేశ వ్యూహాత్మక లక్ష్యాలకు ఎంత‌గానో దోహదపడ్డాయి. 2021-22లో ఈ సంస్థ మొత్తం 102 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేప‌ట్టింది.