మీ భార్యకు షాపింగ్ పిచ్చి వుందా..! అయితే సుధామూర్తి మాటలు మీకోసమే..!!
సుధామూర్తి... ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి భార్య. వేల కోట్ల ఆస్తులు కలిగివున్నా ఆమె చాలా సింపుల్ గా వుంటారు... ఇందుకు గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారామె.
Sudha Murthy : ఆమె ఇన్ఫిసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అత్త. వేలకోట్ల ఆస్తులను కలిగిన శ్రీమంతురాలు. కానీ ఆమెను చూస్తే సాధారణ మధ్యతరగతి మహిళలా కనిపిస్తారు... ఎక్కడా ధనవంతురాలన్న దర్పం ప్రదర్శించరు. ఈ సింప్లిసిటీనే ఆమెను రాజ్యసభ వరకు చేర్చింది. తాజాగా రాజ్యసభలో మహిళ ఆరోగ్యం, మన చారిత్రక కట్టడాల గురించి ఆమె చేసిన మొదట స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సుధామూర్తి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో సుధామూర్తి తన చీరల గురించి చెప్పిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
30 ఏళ్లుగా చీరే కొనలేరట..:
సాధారణ మధ్యతరగతి మహిళలు ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ కట్టాలంటే నామోషీగా ఫీలవుతారు. ఖరీదైన చీరలు, బంగారు ఆభరణాలు ధరించాలని తహతహలాడిపోతుంటారు. స్తోమత లేకున్నా చీరలు, నగల కోసం భర్తలను వేధించే మహిళలను చూస్తుంటాం. కానీ అనుకుంటే రోజుకో చీర కట్టుకునే శ్రీమంతురాలు సుధామూర్తి. అలాంటిది ఆమె చీర కొనుక్కుని 30 ఏళ్లు అవుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలిపారు.
ఇప్పుడు వేలకోట్ల ఆస్తులు కలిగిన శ్రీమంతురాలు సుధామూర్తి...కానీ ఆమె పుట్టిపెరిగింది మధ్యతరగతి కుటుంబంలోనే. తన తల్లిదండ్రులు ఆడంబరాలకు దూరంగా వుండేవారు... అదే తనకు అలవాటయ్యిందని సుధామూర్తి చెప్పారు. ముఖ్యంగా తల్లి, అమ్మమ్మను చూసి సింప్లిసిటీ అలవాటయ్యింది... ఇది ఇప్పటికీ కొనసాగుతోందని తెలిపారు.
గతంలో అందరు మహిళల మాదిరిగానే షాపింగ్ అంటే ఎంతో ఇష్టపడేదాన్నని సుధామూర్తి తెలిపారు. కానీ ఓ సమయంలో ఈ షాపింగ్ పై విరక్తి పుట్టిందని... ఇక ఎప్పుడూ షాపింగ్ చేయవద్దని నిశ్చయించుకున్నానని తెలిపారు. అయితే ఇలా ఊరికే మానేయడం కుదరలేదు... అందువల్లే కాశీకి వెళ్లి గంగానదిలో తన షాపింగ్ ఇష్టాన్ని వదులుకున్నానని తెలిపారు. గంగానది సాక్షిగా ఇక షాపింగ్ చేయనని ప్రమాణం చేసినట్లు సుధామూర్తి తెలిపారు.
ఇలా షాపింగ్ అలవాటు వదులకుని ఇప్పటికి 30 ఏళ్లు అవుతోందని... ఇప్పటివరకు తాను ఒక్క చీర కొనింది లేదన్నారు. తాను షాపింగ్ చేయనని తెలిసిన బంధువులు, స్నేహితులు తనకు చీరలు బహుమతిగా ఇస్తుంటారని... వాటిలోనూ ఖరీదైనవి వుంటే తీసి పక్కన పెట్టేస్తానని తెలిపారు. సింపుల్ గా మధ్య తరగతి మహిళలా చీర కట్టుకోవడాన్నే తాను ఇష్టపడతానని సుధామూర్తి తెలిపారు.
సుధామూర్తి చీరల కామెంట్స్ పై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్...:
చూసారా మహిళలు... ఇన్నివేల కోట్ల ఆస్తులున్న మహిళే ఇంత సింపుల్ గా వున్నారు... మీరెందుకు చీరలు, నగలు అంటూ ఆర్బాటాలు చేస్తారు అంటూ మహిళలకు చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు. భర్తలను చీరలు, నగల కోసం వేధించే మహిళామణులు.. సుధా మూర్తిని చూసయినా మారండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా సుధామూర్తి చీరల గురించి కామెంట్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.