కూరగాయాలు అమ్మేవారు ఇంగ్లీష్ లో మాట్లాడటం ఎప్పుడైనా విన్నారా.. మహా అయితే.. వాళ్లకి వాళ్లు అమ్మే కూరగాయల పేర్లు తెలుస్తాయేమో. కానీ.. ఈ వీడియోలో కూరలమ్మే అమ్మాయి మాత్రం ఇంగ్లీష్ దంచికొడుతోంది. ఆమె మాట్లాడే ఇంగ్లీష్ వెంటనే.. ఎవరైనా ముక్కు మీద వేలువేసుకోవాల్సిందే.  ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కూరగాయలు అమ్మే ఓ మహిళ ఆంగ్ల భాషలో అనర్గలంగా మాట్లాడేస్తోంది. తన కూరగాయల బండిని తీసేసిన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని ఇంగ్లిష్‌లో చెడా మడా కడిగేసింది.  ఆమె ఇంగ్లీష్ భాష చూసి.. అక్కడనున్నవారంతా అవాక్కయ్యారు. 

కూరగాయలు అమ్ముకోకుండా అడ్డుపడితే.. తాను, తన కుటుంబం ఎలా బతకాలని ఆ మహిళ నిలదీసింది? తన పిల్లల్ని ఎలా పోషించాలని ప్రశ్నించింది. తమ బతుకులు తమను బతకనివ్వరా అని అధికారులను ప్రశ్నించింది. తాను, తన పూర్వీకులు ఏళ్లుగా కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారని ఆమె తెలిపింది.

 

తన పేరు రైసా అన్సారీగా తెలిపిన ఆ మహిళ.. తాను మెటీరియల్ సైన్సెస్ విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేసినట్లు తెలిపింది. మరీ ఈ పని ఎందుకు మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని ఒకరు ఆమెను ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది.

అసలు తనకు ఉద్యోగం ఎవరు ఇస్తారని ప్రశ్నించింది. ‘‘ముస్లింల నుండి కరోనావైరస్ ఉత్పత్తి అవుతుందనే అభిప్రాయం ఇప్పుడు సాధారణమైంది. నా పేరు రీసా అన్సారీ కాబట్టి, ఏ కాలేజీ లేదా పరిశోధనా సంస్థ నాకు ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా లేదు’’అని ఆమె పేర్కొనడం గమనార్హం.