Indigo: నాగ్‌పూర్ నుండి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక వ్యక్తి  ఎమర్జెన్సీ గేట్ తెరవడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో విమాన సంస్థ ఫిర్యాదుతో ఆ ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Indigo: ఇండిగో విమానంలో కలకలం చెలారేగింది. నాగ్‌పూర్ నుంచి బెంగళూరు మీదుగా థాయ్‌లాండ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ గేట్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ విమాన సిబ్బంది, మిగతా ప్రయాణికులు ఆందోళన చెందారు. అతడిని నిలువరించారు. ఈ నేపథ్యంలో విమాన సంస్థ ఫిర్యాదుతో ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

వివరాల్లోకెళ్తే.. సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి ఇండిగో విమానం నాగ్‌పూర్ నుంచి బెంగళూరు మీదుగా థాయ్‌లాండ్‌కు వెళ్తోంది. ఈ సమయంలో ఇందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు విమానం బెంగళూరులో టేకాఫ్ అవ్వబోతుండగా విమానం ఎమర్జెన్సీ గేటును తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఆ విమాన సిబ్బంది, మిగతా ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతడ్ని నిలువరించే ప్రయత్నం చేశారు. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన విమాన సిబ్బంది 

ఈ నేపథ్యంలో విమాన సంస్థ ఫిర్యాదుతో ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తూ, అరెస్టు చేసిన వ్యక్తిని స్వప్నిల్ హోల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 11:55 గంటలకు విమానం దిగినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఆ ప్రయాణికుడిని ఎయిర్‌లైన్ సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 336 కింద ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు నిందితుడు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబరు 1న విమానంలో బ్యాంకాక్ వెళ్లాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆ తర్వాత పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు.