బీహార్‌లో ఇండిగో పాట్నా మేనేజర్‌ రూపేష్‌ కుమార్‌ హత్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రూపేష్‌ కుమార్‌ను మంగళవారం గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బిహార్‌లో కలకలం రేగింది. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై మండిపడుతున్నారు. 

హత్యకు ముందురోజు రూపేశ్‌ కుమార్‌ గోవాలో కుటుంబసభ్యులతో సరదాగా గడిపి బిహార్‌కు వచ్చాడు. పాట్నా పునాయ్‌చక్‌లోని కుసుమ్‌ విలాస్‌ అపార్ట్‌మెంట్‌లో రూపేశ్‌ నివసిస్తున్నాడు. తన ఇంటినుంచి మంగళవారం సాయంత్రం 7గంటలకు బయటికి వచ్చిన రూపేష్ ను ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. 

రూపేష్ పై ఏకంగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన రూపేష్‌ కుమార్‌ను ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. ఈ ఘటన బిహార్‌లో కలకలం రేపింది. ఈ ఘటన రాజకీయంగా వివాదాస్పదమైంది. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌ తీవ్రస్థాయిలో నితీశ్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

హంతకుల చేతిలో రాష్ట్రం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్న నేరస్తులే రూపేశ్‌ను హతమార్చారని ఆరోపించారు. హంతకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. జన్‌ అధికార్‌ పార్టీ అధినేత పప్పూ యాదవ్‌ కూడా ఈ ఘటనపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.