ఇండిగో ఎయిర్ లైన్స్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఎయిర్ హోస్టెస్, ఆమె తల్లి అదే ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూగా పనిచేస్తున్నారు.
ఆదివారం మే 14ను మదర్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా జరుగుపుకున్నారు. తల్లులు చేసే నిరంతర సేవను, వారి ప్రేమానురాగాలను గౌరవించి, అభినందించడానికి ఒక ప్రత్యేక సందర్భంగా ప్రపంచమంతా నిన్న పండగ జరుపుకుంది. తల్లులు, పిల్లలకు ఉన్న ప్రత్యేక బంధాన్ని హైలైట్ చేసే అనేక పోస్ట్‌లతో సోషల్ మీడియా వెల్లువెత్తింది.
వీటిల్లో ఇండిగో ఎయిర్ లైన్స్ పోస్ట్ చేసిన ఒక అందమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను విపరీతంగా ఆకర్షించింది. వీడియోలో ఇండిగో ఎయిర్ హోస్టెస్, ఆమె తల్లి.. ఇద్దరూ కనిపిస్తున్నారు. విషయం ఏంటంటే ఆ తల్లి కూడా అదే ఎయిర్‌లైన్ క్యాబిన్ సిబ్బందిగా పనిచేస్తుండడం.
కూతురు తల్లి గురించి.. ''నేలమీద, గాలిలో ఎప్పుడూ నా వెన్నంటే వ్యక్తికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు'' అని ఇండిగో వీడియోతో పాటు ట్వీట్ చేసింది. నబీరా సష్మీ అనే ఎయిర్ హోస్టెస్ తనని తాను ప్రయాణికులకు పరిచయం చేసుకుని.. ఆ తర్వాత తన తల్లిని పరిచయం చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. తన తల్లిని తను చేస్తున్న విమానంలోనే.. తన సాటి క్యాబిన్ క్రూ మెంబర్‌గా యూనిఫాంలో చూడటం ఇదే మొదటిసారి అని ఆమె వ్యాఖ్యానించింది.
"నేను ఆమె క్యాబిన్‌లోనే అన్ని పనులు చేస్తున్నాడు. ఈ రోజు ఆమె షూసే నేను వేసుకున్నాను. గత ఆరేళ్లలో, ఆమె ఈ పిఎపై మాట్లాడటం నేను చూశాను, ఈ రోజు, నేను తన తరపున మాట్లాడే రోజు వచ్చింది. ఈ రోజు నేను ఆమెను గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నాను" అని సష్మి చెప్పింది.
ఈ ప్రకటన విని, ఆమె తల్లి తన కూతురి చెంప మీద ప్రేమతో ముద్దుపెట్టుకుంది. ఆమె భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యింది. ఇది చూసిన ప్రయాణికులు ఉత్సాహంతో, భావోద్వేగంతో చప్పట్లు కొడుతూ వారికి మరింత ఉత్తేజాన్నిచ్చారు.
మదర్స్ డే సందర్భంగా ఈ తల్లీ-కూతుళ్ల భావోద్వేగం వీడియో.. వైరల్ అవుతోంది. మదర్స్ డే నాడు వారిద్దరూ కలిసి ఒకే విమానంలో పని చేసే అవకాశం ఇచ్చినందుకు ఇండిగోకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు. దీనిమీద స్పందిస్తూ ఒక నెటిజన్ ''హృదయాన్ని హత్తుకునే ప్రేమ పూరితమైన వీడియో ఇది. మాతృదినోత్సవ శుభాకాంక్షలు'' అనగా.. మరొకరు ''ఇండిగో రోస్టర్ డిపార్ట్‌మెంట్ మాతృ దినోత్సవం రోజున తల్లీకూతుళ్లకు ఒకే విమానంలో డ్యూటీ వేయడం మంచి ఆలోచన'' అని మెచ్చుకున్నారు.
మూడో వ్యక్తి ''చాలా చాలా సంతోషకరమైన మాతృదినోత్సవం! మీ కెరీర్‌కు శుభాకాంక్షలు!'' అంటే.. నాలుగో వ్యక్తి, ''నేను ఈ వీడియో చూసి ఏడ్చేశాను.. తల్లీ కూతుళ్లకు గర్వకారణమైన సందర్భం’’ అన్నారు.
ఇక ఇండిగో పోస్ట్ చేసిన ఈ వీడియోను కూతురు రీట్వీట్ చేసి, ''చివరికి నా కల నిజమయ్యింది'' అని కామెంట్ చేసింది.
