Asianet News TeluguAsianet News Telugu

పట్టాలెక్కిన తొలి కిసాన్ రైలు.. మహారాష్ట్ర నుంచి బీహార్‌కు పరుగు

మహారాష్ట్ర నాసిక్ జిల్లా దియోలలి నుంచి బీహార్‌లోని దనాపూర్‌కు దేశంలోనే తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ , రైతు  సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు

indias first Kisan Rail flagged off from Deolali in Maharashtra
Author
Nasik, First Published Aug 7, 2020, 4:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రైతుల దిగుబడులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు వీలుగా తొలి కిసాన్ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్ర నాసిక్ జిల్లా దియోలలి నుంచి బీహార్‌లోని దనాపూర్‌కు దేశంలోనే తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ , రైతు  సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో తోమర్ మాట్లాడుతూ... వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాల రవాణాకు కిసాన్ రైలు ఉపయోగపడుతుందన్నారు. అన్నదాతలు తమ దిగుబడులకు సరైన ధర పొందేలా తక్కువ చార్జీలతోనే ఈ రైలు సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు.

కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో ఆహారోత్పత్తుల సరఫరా కోసం భారతీయ రైల్వేలు 96 రూట్లలో 4,610 రైళ్లను నడుపుతున్నాయని మంత్రి చెప్పారు. రైతులు స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రధాని నరేంద్రమోడీ పలు చర్యలు తీసుకుంటున్నారని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

దియోలలి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయల్దేరే కిసాన్ రైలు మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు దనాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భాగంగా ప్రతి ఆదివారం రాత్రి 12 గంటలకు దనాపూర్‌లో బయల్దేరి మరసటి రోజు సాయంత్రం 7.45 గంటలకు దియోలలి చేరుకుంటుంది.

ఈ రైలు ఒక ట్రిప్‌లో 31.45 గంటల ప్రయాణంలో 1,519 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో నాసిక్ రోడ్, మన్మాడ్, జల్గావ్, భూసావల్, బుర్హాన్‌పూర్, ఖండ్వా, ఇటార్సీ, జబల్ పూర్, సత్నా, కట్ని, మాణిక్ పూర్, ప్రయాగరాజ్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, బక్సార్ స్టేషన్లలో ఆగుతుంది.

కిసాన్ రైలు రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుందని, స్థానిక రైతులు, వ్యాపారులు, మార్కెట్ కమిటీలతో కలిసి రైతులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios