India Rising: ప్రపంచ దేశాలపై భారత డిజిటల్ ముద్ర.. జీ20 న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో డీపీఐపై ఏకాభిప్రాయం

జీ 20 న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో డీపీఐపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇందులో భారత్ కీలక పాత్ర పోషించింది. 21వ శతాబ్దంలో డేటా చాలా ముఖ్యమైంది. దీన్ని సొసైటీ లెవల్‌లో ఉపయోగించి ప్రజలకు గణనీయమైన లబ్దిని చేకూర్చవచ్చు. 
 

indias digital imprint on world stage with digital public infrastructure system kms

న్యూఢిల్లీ: 21వ శతాబ్దంలో డేటా అనేది ముఖ్యపాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే. ఇక్కడ డేటా అంటే ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక, రక్షణ మొదలైన రంగాలకు చెందిన సమాచారం. ఇవి చాలా రహస్యంగా, చౌర్యానికి గురి కాకుండా చూసుకోవాల్సిన సమాచారం కావడంతో సైబర్ సెక్యూరిటీ అలాగే, మేధోపరమైన హక్కుల గురించిన సమస్యలూ ముందుకు వస్తున్నాయి. అందుకే భారత్ కృత్రిమ మేధస్సును చాలా బాధ్యతాయుతంగా, అందరికీ లబ్ది చేకూరే రీతిలో వాడాలని గట్టిగా చెబుతున్నది.

భారత సారథ్యంలో ఢిల్లీలో జీ 20 శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు అనేక ప్రయోజనాలకు దారులు వేసింది. ఇందులో జీ20 దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ) కోసం ఫ్రేమ్‌వర్క్ కోసం ఏకాభిప్రాయం కుదరడం ముఖ్యమైంది. న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో డీపీఐ సిస్టమ్ ఫ్రేమింగ్ కోసం జీ20 దేశాలు మద్దతు తెలిపాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రస్తుత సిస్టమ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ డీపీఐ సిస్టమ్‌ను పేర్కొన్నాయి.

సామాజిక స్థాయిలో డీపీఐ అందించే సౌకర్యాలపై ఈ దేశాల నేతలకు అవగాహన ఉన్నది. అందుకే ప్రపంచ దేశాల అధినేతలు అంతర్జాతీయ స్థాయిలో కృత్రిమ మేధస్సు రెగ్యులేషన్ కోసం కలిసి పని చేయడానికి అంగీకరించారు. ఢిల్లీ డిక్లరేషన్‌కు ముందు ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదురుతుందా అనే అనుమానాలు వచ్చాయి. నాటో సభ్య దేశాలు ఈ గ్రూపులో ఉండటం, మరో వైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతుండటంతో ఏకాభిప్రాయం అసాధ్యమనే సందేహాలు వచ్చాయి.

కానీ, భారత షెర్పా, ఆయన టీమ్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వర్తమాన, భవిష్యత్‌లలో అంతర్జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పులు తేగల అంశాలపై ఏకాభిప్రాయాన్ని తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. ఇది భారత్‌కు ఘన విజయం. గ్లోబల్ సౌత్ కంట్రీగా ఉన్న భారత్ డిజిటైజేషన్ ద్వారా సమాజానికి ఎంతటి లాభాలు ఉన్నాయో? అభివృద్ధి చెందిన దేశాలకు చెప్పగలిగింది. జీ20లోని చాలా దేశాలు భారత్ చర్చించిన డీపీఐని సీరియస్‌గా తీసుకున్నాయి.

ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే.. ఇండియా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో గత కొన్ని దశాబ్దాలుగా ముందంజలో ఉన్నది. ప్రపంచంలోని చాలా ఐటీ కంపెనీలకు భారతీయులు, లేదా భారత సంతతివారే చీఫ్‌లుగా ఉన్నారు. ఐటీ రంగంలో భారతీయులు చేస్తున్న కృషి అభివృద్ధి చెందిన దేశాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నది. బ్యాంకింగ్ రంగం నుంచి విద్యా రంగం, రక్షణ రంగం వరకు భారత ఐటీ వర్కర్ల కృషి ఉన్నది.

ఇటీవలి కాలంలోనే భారత్ డీపీఐకి చెందిన మూడు ప్రాథమిక కోణాల్లో విజయవంతమైంది. ఒకటి యూపీఐ ద్వారా రియల్ టైమ్ ఫాస్ట్ పేమెంట్, రెండోది ఆధార్ వంటి డిజిటల్ ఐడెంటిటీ, మూడోది, ప్రైవేట్ సమాచారం పంచుకోవడానికి ఒక వేదికను తయారు చేయడం. 

ఈ అంశాల్లో ఎలాంటి పొరపాటు దొర్లకుండా, పటిష్టమైన భద్రత కోసం భారత్ తపిస్తున్నది. అందుకే గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిపోసిటరీ కాన్సెప్ట్‌ను గ్లోబల్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తయారీ కోసం ఎంచుకుంటున్నది. 

ప్రపంచ నేతలు భారత అనుభవంపై అవగాహన ఉన్నవారే. జీ20 దేశాలకు భారత్ ఎంతో అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని వారికి తెలుసు. 2016లో భారత్ పెద్ద నోట్లను రద్దు చేసింది. దాని లక్ష్యాలు, విజయాలను పక్కనపెడితే.. అది డిజిటల్ పేమెంట్‌కు పెద్ద ఊపును ఇచ్చింది. యూపీఐ, జన్ ధన్ బ్యాంక్ ఖాతా, ఆధార్ వంటి అనేకం ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్..  కామర్స్ సెక్టార్ విప్లవాత్మక మలుపులు తిప్పింది. ఉదాహరణకు కొవిన్ పోర్టల్ ద్వారా విజయవంతంగా టీకా పంపిణీ చేయగలిగింది.

ఈ విజయంపై ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఆశ్చర్యంలోనే ఉన్నాయి. భారత సాధారణ పౌరులు కూడా వేగంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు. 

కృత్రిమ మేధస్సు చాలా విస్తారమైన క్షేత్రం. డీపీఐ సిస్టమ్ ద్వారా సమాచారాన్ని దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకోవచ్చునని, అదీ విశ్వసనీయంగా, అంతర్జాతీయ చట్టాలకు లోబడి చేయవచ్చని భారత్ ప్రతిపాదించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు గణనీయంగా వృద్ధి చెందడానికి డేటా ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్ని దేశాలు నమ్ముతున్నాయి. 

Also Read: ఇస్లాంలో డ్రెస్ కోడ్ లేదు.. హిజాబ్, మినీ స్కర్ట్ రెండూ ఓకే.. ముస్లిం దేశాలకు ఉజ్జెకిస్తాన్ మాడల్

భవిష్యత్‌లో భారత్ డీపీఐని వాస్తవరూపానికి తీసుకురావచ్చు. జీ20 వంటి సదస్సుల్లో సభ్య దేశాలను సమాచారం పంచుకోవడానికి అంగీకరింపజేయడం ఒక విజయం. అయితే, ఈ ప్రక్రియను మొదలుపెట్టడం ఇంకా చాలా ముఖ్యమైన అంశం.

డేటా చాలా ముఖ్యమైనది కాబట్టే భారత్ కృత్రిమ మేధస్సు గురించి చర్చించింది. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పూర్తిగా ఆధారపడటం కూడా సముచితం కాదు. 

భారత్‌కు టెక్నాలజీ స్కిల్డ్ మ్యాన్‌పవర్ పుష్కలంగా ఉన్నది. కేవలం ప్రైవేటురంగంలోనే కాదు.. ప్రభుత్వ రంగంలోనూ దీన్ని అమలు చేయడం సాధ్యమే. ఇప్పుడు చేయల్సిందేమిటంటే డీపీఐ సెక్టార్ పై జీ 20 దేశాలతో పని చేసి ఈ కాన్సెప్ట్‌ను సక్సెస్ చేయడమే. ఇది సాధ్యం చేస్తే ప్రపంచ వేదికపై భారత్ తన ముద్ర వేసుకున్నట్టే.

--- రచయిత అజయ్ లెలె... మనోహర్ పారికర్ ఐడీఎస్ఏ‌లో కన్సల్టెంట్. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై ఎన్నో వ్యాసాలు ప్రచురించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios