ఇస్లాంలో డ్రెస్ కోడ్ లేదు.. హిజాబ్, మినీ స్కర్ట్ రెండూ ఓకే.. ముస్లిం దేశాలకు ఉజ్బెకిస్తాన్ మాడల్
ఉజ్బెకిస్తాన్ ఇతర ముస్లిం దేశాలకు ఆదర్శంగా ఉన్నది. ఇక్కడి వారి వ్యక్తిగత స్వేచ్ఛను, మతాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. వారి ప్రాచీన చరిత్ర ఒక విశిష్ట సమాజ నిర్మాణానికి దోహదం చేసింది. ఇక్కడ హిజాబ్ ధరించవచ్చు. మినీ స్కర్ట్‌కూ అభ్యంతరాలు లేవు. అసలు ఇస్లాం ఒక డ్రెస్ కోడ్ కచ్చితంగా విధించలేదని ఉజ్బెకిస్తాన్ నిపుణులు చెబుతారు.
న్యూఢిల్లీ: ఇస్లాంలో స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ అనేది లేదని ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ ముఫ్తీ నురుద్దీన్ ఖలిక్నజరోవ్ పలికారు. మతపరమైన డ్రెస్సుల విషయంలో మనం చాలా దూరం వెళ్లాం. ఇస్లాం కొన్ని నిర్దేశిత డ్రెస్సులు, కొన్ని పద్ధతుల్లోనే వస్త్రధారణ ఉండాలని కోరిందనే అభిప్రాయాల వరకు వెళ్లాం. ప్రొఫెట్ ఆ నిర్ణయాన్ని మనకే వదిలేశారు. ఇస్లాం కచ్చితంగా ఇలాంటి పద్ధతిలోనే ఉండాలని చెప్పలేదు, అది అసాధ్యం. ఇది ఒక దేశానికి, ఒక కాలానికి సంబంధించిన మతం కాదు’ అని ముఫ్తీ వివరించారు. మొహమ్మద్ ప్రవక్త మాటలను ఆయన ఉటంకించారు. ‘ఆ అల్లా నీ అలంకరణ, నీ సంపదను చూడడు. ఇస్లాం అనేది సమస్త మానవాళి కోసం పంపబడింది’ అని వివరించారు.
ముస్లింగా, ఉజ్బెక్‌గా ఉండాలనేది దేశంలోని మెజార్టీ ప్రజల ఆలోచన అని గ్రాండ్ ముఫ్తీ తెలిపారు. ఉజ్బెకిస్తాన్ ఒక విశిష్ట దేశం. గొప్ప ఇస్లామిక్ వారసత్వాన్ని కలిగి ఉన్న ముస్లిం మెజార్టీ దేశం. ముస్లిం ప్రపంచంలో ప్రముఖులు ఉదాహరణకు హడిత్స్ సంగ్రహకర్త ఇమామ్ మొహమ్మద్ ఇబ్న్ ఇస్మాయిల్ అల్ బుఖారి, నక్షబంది సూఫీ విధాన స్థాపకుడు బహావుద్దీన్ నక్షబంది వంటివారు ఇక్కడ జన్మించారు.
మధ్యయుగాల్లో బుఖారా, సమర్ఖండ్‌లు ఇస్లాం బోధనలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి ప్రాంతంలోని ఇస్లాం మిగిలిన ప్రాంతాల్లోని ఇస్లాంకు చాలా భిన్నమైందని ఉజ్బెక్‌లు తరుచూ చెబుతారు. ఇక్కడి ఇస్లాం సున్నితమైనదని, ఉదారమైనదని, విశిష్టమైనదని అంటారు. అనేక సంప్రదాయాలు, సంస్కృతులకు నిలయంగా ఉన్నదని, అలాగే, ప్రాచీన సిల్క్ రూట్ కూడా ఈ ప్రాంతం గుండా వెళ్లడంతో అనేక ఇతర సంస్కృతులు, సంప్రదాయాల ప్రభావం ఇక్కడి ప్రజలపై ఉన్నదని చెబుతారు. ఆ తర్వాత రష్యా జారిస్టుల సామ్రాజ్యంలో ఈ ప్రాంతం కలిసిపోయింది. అనంతరం, యునియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లలో ఒకటిగా ఉండింది. కానీ, యూఎస్ఎస్ఆర్ కుప్పకూలిపోయిన తర్వాత ఉజ్బెకిస్తాన్ ఒక స్వతంత్ర రిపబ్లిక్‌గా అవతరించింది.
సోవియట్ పాలన వీరికి వరంగానూ అదే విధంగా శాపంగానూ ఉండింది. కమ్యూనిజం క్రమంగా మతాన్ని మరుగునపరిచే ప్రయత్నం చేసింది. కానీ, ఇక్కడి ప్రజల గుండెల్లో నుంచి మతాన్ని సమూలంగా రూపుమాపలేకపోయింది. అదే విధంగా ఇక్కడ యూనివర్సల్ లిటరసీ, పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత ఘనంగా అభివృద్ధి చెందాయి.
నేడు ఉజ్బెకిస్తాన్ మధ్యాసియాలో 35.5 మిలియన్ల జనాభాతో అధిక జనాభాగల దేశం. అఫ్గనిస్తాన్‌తో సరిహద్దు పంచుకునే ఉజ్బెకిస్తాన్‌లో అన్ని రంగాల్లో అంటే రాజకీయాలు, విద్యారంగం, మీడియా, వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యారోగ్యం, ఆతిథ్యరంగం, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, మొదలైన రంగాల్లో మహిళలు ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. కానీ, దాని పొరుగు దేశమైన అఫ్గనిస్తాన్‌లో బాలికలు స్కూల్‌కు వెళ్లడానికి పోరాడుతున్నారు.
ఉజ్బెకిస్తాన్ ఒక రిపబ్లిక్‌గా ఏర్పడినప్పుడు కొన్ని మతశక్తులు జిహాద్ ప్రారంభించి ర్యాడికల్ కంట్రీగా మార్చే కుట్రలు చేశాయి. అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ల ప్రాబల్యం పెరగడం ఈ దేశానికి ఒక ముప్పే. ఐఎస్ఐఎస్ సహా ఇతర ఉగ్ర సంస్థలు కూడా ఉజ్బెకిస్తాన్ యువతను వాటి తీవ్ర భావజాలంలోకి లాగే కుట్రలు చేస్తున్నాయి. అయితే.. చాలా వరకు ఆ దేశ ప్రభుత్వం సమర్థవంగా డీల్ చేసింది. ఈ క్రమంలో అంతర్జాతీయ వేదికలపై కొన్ని సార్లు ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ, ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం వెనుకంజ వేయలేదు.
Also Read: Cabinet Meeting: సాయంత్రం కేంద్ర క్యాబినెట్ భేటీకి ప్రధాని మోడీ నిర్ణయం
ఉజ్బెకిస్తాన్ పౌరులు యూఎస్ఎస్ఆర్ కంటే ముందటి తమ మూలాలపై అపూర్వ గౌరవంతో ఉంటారు. అందుకే వారు ఇస్లాంను ఆదరిస్తారు. అదే విధంగా సెక్యులర్‌ను కూడా కొనసాగించాలని కోరుకుంటారు. అందుకే ఉజ్బెకిస్తాన్ గణనీయంగా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు అనేక కొత్త అధికార కార్యాలయాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్‌లు దర్శనమిస్తాయి. జర్నలిజం, మీడియా స్టడీస్ వంటి వాటికి డెడికేటెడ్ అయిన యూనివర్సిటీలు ఉన్నాయి. దేశంలో 97 శాతం లిటరసీ ఉన్నది. ఉన్నత విద్యలోకి వెళ్లుతున్నవారి శాతం 9 నుంచి 38 శాతానికి పెరిగింది. ఆరోగ్య ఇండెక్స్ కూడా పెరిగింది. పేదరికం ఇండెక్స్ 17 నుంచి 14కు పడిపోయింది.
హోటల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు విస్తరించాయి. ఘనమైన ప్రాచీన చరిత్ర, అబ్బురపరిచే ఆర్కిటెక్చర్, రిచ్ హ్యాండిక్రాఫ్ట్స్, సంస్కృతులు ఆతిథ్య రంగం వృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రపంచంలో ఇంటర్నేషనల్ టూరిస్ట్‌లకు స్వర్గధామంగా ఉన్నది. దేశంలోపల కనెక్టివిటీ పెరిగింది. బుల్లెట్ ట్రైన్లు, ఫ్లైట్లు పురాతన నగరాలు ఖీవా, సమర్ఖండ్ వంటి చోట్లను అనుసంధానిస్తున్నాయి. ఆల్కహాల్ ఉచితంగా అందుబాటులో ఉన్నది. నైట్ క్లబ్‌లు, డిస్కోలు కూడా ఉన్నాయి.
ఉజ్బెకిస్తాన్‌లో ట్రిపుల్ తలాఖ్ ఉన్నదా? అని అడగ్గా వారు విచిత్రంగా చూశారు. ఇక్కడ విడాకులను ఫ్యామిలీ కోర్టులు డీల్ చేస్తాయి. ట్రిపుల్ తలాఖ్ అనే విధానమే లేదు.
‘అరబ్ ప్రపంచం, టర్కీ వంటి దేశాలకు భిన్నంగా ఇక్కడ ఇస్లాం ఆచరణ ఉంటుంది. శతాబ్దాల తరబడి సిల్క్ రూట్ దారిలో ఉన్నాం. విభిన్న సంస్కృతులు, ఆలోచనల ప్రభావం తమ మీద ఉన్నది. బుద్ధిజం సహా అనేక విధాల ఆలోచనల ప్రభావం ఇక్కడ పడింది.’ అని ఉజ్బెక్ పొలిటికల్ సైంటిస్టు బెక్తోష్ బెర్డీవ్ తెలిపారు. ఉజ్బెకిస్తాన్ ఒక దేశంగా రూపుదాల్చుతున్నప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు షవ్కత్ మిర్చియోయెవ్ మతం, చర్చలకు అధిక స్వేచ్ఛను ఇచ్చే విధానాన్ని ఎంచుకున్నారని తెలిపారు. ‘ప్రజలు మతాన్ని అవలంభించవచ్చు. కానీ, తీవ్రవాద, ర్యాడికల్‌గా మారరాదు. మది ముస్లిం మెజార్టీ దేశం కానీ, ఒక ప్రజాస్వామిక దేశం’ అని చెప్పారు.
‘గత కొన్నేళ్లుగా ఇక్కడ ప్రజలు మసీదులకు వెళ్లుతున్నారు. రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేస్తున్నారు. చాలా మంది మహిళలు హిజాద్ ధరిస్తున్నారు. ఇది వారి ఇష్టపూర్వకంగా, ఒక ఫ్యాషన్ ప్రయోగంగా ధరిస్తున్నారు. వద్దనిపించినప్పుడు హిజాబ్ ధరించడాన్ని ఆపుతున్నారు. ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామిక ఉజ్బెక్ సమాజానికి ఒక సింబల్’ అని వివరించారు.
అందుకే ఇతర ముస్లిం దేశాలు ఉజ్బెకిస్తాన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చని నా అభిప్రాయం.
--- అదితీ భాదురి