న్యూఢిల్లీ: దేశంలో 20 కోట్ల మందికి కరోనా వచ్చి పోయిందని  సర్వే తేల్చి చెప్పింది.దేశంలో కరోనాపై ఐసీఎంఆర్- సీరో రెండో దఫా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

దేశంలోని ప్రతి 15 మందిలో ఒక్కరికి కరోనా సోకినట్టుగా ఈ నివేదిక తెలుపుతోంది.ఆగష్టు 17 నుండి సెప్టెంబర్ 22 వరకు దేశంలోని 29,082 మందిని సర్వే చేశారు. దేశంలోని జనాభాలో 7.1 శాతం మంది కరోనా వైరస్ కు గురైనట్టుగా ఈ నివేదిక తెలిపింది.

18 ఏళ్ల కంటే వయస్సున్నవారికి వైరస్ బారినపడినట్టుగా రికార్డులు తెలిపారు.మురికివాడల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నట్టుగా సర్వే రిపోర్టులు చెప్పారు. పట్టణ కేంద్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయని ఈ సర్వే రిపోర్టు తేల్చింది.

మురికివాడల్లోని వారికి 15.6 శాతం, పట్టణ కేంద్రాల్లో మురికివాడలు లేనివారికి 8.2 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.4 శాతం కేసులు నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

దేశంలోని 700 గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో సర్వే నిర్వహించారు. 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించినట్టుగా రిపోర్టు తెలిపింది.దేశంలోని తొలి సర్వే  మే 11 నుండి జూన్ 4వ తేదీ మధ్యలో నిర్వహించారు. రెండో విడతలో 29,082 మంది నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. గత సర్వేలో నిర్వహించిన 28 వేల శాంపిల్స్ తో పోల్చి చూసింది.