భారత సంతతికి చెందిన ఓ 14ఏళ్ల బాలుడు తన చేతితో అద్భుతాలు సృష్టించాడు. అద్భుతంగా పొట్రియాట్ లు గీశాడు. కాగా... ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ కూడా అంతే అద్భుతంగా గీశాడు. దీంతో.. ఆ బాలుడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దన్యవాదాలు తెలియజేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్‌కు చెందిన శరణ్ శశికుమార్(14) అనే బాలుడిని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ అతడికి లేఖ రాశారు. దుబాయిలో స్థిరపడిన శశికుమార్ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ స్టెన్సిల్ పోట్రియాట్ చేశాడు. యూఏఈ పర్యటనలో భాగంగా అక్కడకు వెళ్లిన విదేశాంగశాఖ సహాయమంత్రి వీ. మురళీధరన్‌కు ఈ కానుకను అందజేశాడు. శశికుమార్ ప్రతిభను మెచ్చుకుంటూ, అతడికి కృతజ్ఞతలు చెబుతూ మోదీ తాజాగా శశికుమార్‌కు లేఖ రాశారు. 


‘ఆర్ట్ అనేది మన ఆంతరంగిక ఆలోచనలను, భావోద్వేగాలను వ్యక్తపరచడానికి, మన ఊహలను సృజనాత్మకతతో అనుసంధానించడానికి ఒక ప్రభావవంతమైన మాధ్యమం. నువ్వు గీసిన ఈ చిత్రం పెయింటింగ్‌పై నీకున్న నిబద్దతను, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తోంది. అంతేకాకుండా దేశం పట్ల నీకున్న ప్రేమ, అభిమానాన్ని కూడా తెలుపుతోంది’ అంటూ మోదీ లేఖలో రాసుకొచ్చారు. గత గురువారం పీఎంఓ ఆఫీస్ నుంచి ఈ లేఖ తమకు మెయిల్ ద్వారా వచ్చినట్టు శశికుమార్ తండ్రి తెలిపారు. కాగా.. శశికుమార్ స్వస్థలం కేరళ రాష్ట్రం కావడం గమనార్హం.